పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తే. జీర దొలఁగుట యెఱుఁగమి జేసి యతివ[1]
వాంఛ జూచుటఁ చేసి యవ్వసుని మర్త్య
యోని జనియింపుఁ డనుచుఁ బయోజగర్భుఁ
డిరువురకుఁ గోపమున శాప మిచ్చుటయును. 157
 
క. బిసరుహభవునాజ్ఞ నలం
బుస యి ట్లుదయించె వసువు భూవర నీవై
వసుధ జనియించి తనవుడు
వసుధేశుఁడు కౌతుకార్ణవము నడ లెసఁగన్. 158

ఉ. ఆ లలితాంగిఁ జూచుటకునై యురియాడెడునెమ్మనంబుతో
వాలుమగండు కంతుఁ డనివారణ నిల్గులఁ బెట్టి యచ్చటం
గాలుకొనంగ నీమికి వగం దురపిల్లుచు నింద్రుఁ డంప భూ
పాలుఁడు ధాత్రికిన్ విరహభారమునం జనుచుండ ముందఱన్. 159

తిలోత్తమ సహస్రానీకుని శపించుట


సీ. కబరిపైఁ జెరివిన కమ్మని చెంగల్వ
విరులతావికిఁ దేంట్లు వెనుకొనంగఁ
దారహారంబుతోఁ బారిజాతపుదండ
కుదురుఁబాలిండ్లపై గొండ్లియాడఁ
బదపల్లవంబులపై జాఱఁగట్టిన
చీనాంబరము వింతచెలువు చూప
నిర్జరాధిపుఁ డిడ్డ నెలవంక యొత్తులు
చెక్కుటద్దములకు సిరిఘటింప
తే. గతులు రాయంచమురిపంపు గతులఁ దెగడ
నెదురు చనుదెంచుచున్న రాకేందువదన
నాకపురిమెట్టు చెంతఁ జిన్నారిచేడె
నల్లఁ జూచెఁ దిలోత్తమ నప్సరసను[2]. 160



  1. తిమ; యీమె
  2. దిలోత్తమాప్సరసను