పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. మంద్రమధ్యమతారమానసంశ్రుతుల గం
ధర్వకామినులు గీతములు పాడ
రత్నకంకణఝణారావంబు లులియంగ
సురవిలాసినులు నీచోపు లిడఁగ
మేనకాద్యప్సరోమృగనేత్ర లాయాయి
యుడిగంపుఁ బనులకు నోలి నడువ
నఖిలపురాణేతిహాసగోష్ఠీవినో
దంబుల మునిజనుల్ దనరియుండ
ఆ. నున్నతాసనమున నున్న వాని సురేంద్రుఁ
గాంచి యాత్మ వేడ్క గడలుకొనఁగ
యవనిజాని మ్రొక్కి యప్పురందరు నాజ్ఞ
నుచితపీఠ మెక్కి యుండు నంత. 149

వ. శతమఖుండును నతని కభిముఖుండై కుశలం బడిగి కాలోచితంబులగు కథాకలాపంబులు నడుపుచుండునంత మధ్యాహ్నం బగుటయు నమ్మహీకాంతున కవ్వనాంతరంబున నొక్క మణిసౌధంబు విడిదల యిడి మజ్జనభోజనంబు(లు) నడుపునట్లుగా మాతలిని నియోగించి తానునుం గొలువు విడిసి యభ్యంతరంబునకుం జని సముచితవర్తనంబుల నద్దివసంపు గడపి మఱునాఁడు మొదలుకొని— 150

క. ప్రీతాంతరంగుఁడై పురు
హూతుం డచ్చరులుఁ దాను నుద్యా
జాతసురపాదపములకు
జాతర గావించి కేళి సలుపుచు[1] నుండన్. 151
 
వ. వత్సాధీశ్వరుండును నమ్మహోత్సవంబు గనుంగొనుచు డెందంబునఁ బరమానందంబు గందళింప నుండునంత నొక్కనాఁ డప్పురందరుం డొక్కయెడ సుఖాసీనుండై సముచితసల్లాపంబులు జరుపుచు నంత[2] నమ్మహీవిభునకు భావిశుభం బెఱింగించువాఁడై ప్రసంగవశంబున నతనితో ని ట్లనియె. 152



  1. గావించెఁ గేళి సలుపుచు
  2. జరుపుచుండి రంత