పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బాదముల్ నాలుగు పదిలంబుగా మోపి
విహరించె ధర్మంబు వెఱపు దొఱఁగి
కలికాలకృత్యముల్ కడలకు విచ్చేసె
నుర్విలో నెచటఁ గా లూఁద రాక
తే. సేతువుననుండి మేరువు సీమగాఁగఁ
గలుగుదేశాధిపతు లరిగాఁపులైరి
యతఁడు సింహాసనం బెక్కి యతులభూతి
నవనిభారంబు భరియించు టాదిగాఁగ.

వ. మఱియును. 110

గీ. కలితవరనీతిశాలి యుగంధరుండు
మంత్రి రిపువాహినీవార్ధిమంధశిఖరి
సుప్రతీకుండు సేనాని సుభగహాస్య
హారి శాస్త్రార్థకుండుఁ దోడై[1] చరింప. 111
 
సీ. కస్తూరిరేఖలకైవడి మీసముల్
వదనేందునకు నంగపదవిఁ జేయ
వెలిదామరలవోలె[2] వెడఁదకన్నులు కృపా
లక్ష్మి కావాసస్థలములు గాఁగ
మేరువుచెలిమాడ్కి పేరురంబు వయోని
ధానంబునకు గుప్తితలము గాఁగఁ
గులమహీధరశృంగముల భాతి భుజములు
ధరణికి విహరణస్థానములుగ
తే. మిమ్మటంబగు[3] కండగర్వమ్ముతోడ
నతఁడు దక్కిన వ్యసనంబులందు జిత్త
మడిక భూపాలనము నందె యిడి కడంక
నుర్విఁ బాలింపుచుండంగ నొక్కనాఁడు. 112



  1. కుండుం చోటియ్యె
  2. వెవిఁదాయిరల విశిద; వెలిడాలు గదిసిన
  3. మిమ్మిటంబగు