పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. కుంభినీధరకుంభికుంబీనసములకు
నేమంత్రి భుజదండ మేడుగడయ
రాజభానుజరాజరాజఖేచరులకు
నేమంత్రి వితరణం బీడుజోడు
సాహిత్యసౌహిత్యసత్యసంపదలకు
నేమంత్రి ముఖపద్మ మిక్కపట్టు
నలకూబరజయంతనలవసంతాదుల
కేమంత్రిసౌందర్య మింతె[1] వాసి
తే. మందరాచలసురసానుమంతములకు
మహిమ నెయ్యంపుఁ జుట్ట మేమంత్రి ధైర్య
మతఁడు రిపుయూధకుధరవజ్రాయుధుండు
ధర్మగుణశాలి బాచప్రధానమౌళి. 59
 
సీ. అభయంబు వేఁడఁ గృతాపరాధులనైన
దయఁబ్రోచు నాత్మబాంధవులఁ బనిచి
యలవోకనైనను హాస్యంబునకునైనఁ
బాత్రుఁ నాడఁడు నోరఁ బరుషభాష
యర్థిమూఢత్వంబు నర్థలుబ్ధత్వంబు
నెఱుఁగండు మదిలోన నిచ్చుచోటఁ
జిత్తంబులో నన్యవిత్తంబు చూచుచో
గాజు రత్నము నొండుగాఁ దలంచుఁ
తే. బేటనైనను జేపట్టి ప్రిదులనీక
యాత్మ నూహించుకార్యంబు హరిహరాదు
లడ్డునిలిచిన[2]చోనైన నదియ[3] చేయు
మంత్రిమాత్రుండె బాస్కరామాత్యవరుఁడు. 60



  1. మెంతొ
  2. పద్మనించిన
  3. ననియు