పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తే. ఉభయవంశపవిత్ర శ్రీయుతచరిత్ర
ధరణి ముడియములోకప్రధానవరున
కభిమతప్రీతిఁ జేయు నర్ధాంగలక్ష్మి
కలితసద్గుణనికురుంబ కసువమాంబ. 44

క. ఆ కాంతామణియందును
లోకేశ్వరమంత్రి కీర్తిలోలుఁడు గనియెన్
లోకోత్తరచరితుల సు
శ్లోకుల నెనమండ్రుసుతుల సురుచిరమతులన్. 45

సీ. మదవతీమదనుండు పెదతిమ్మనార్యుండు
భైరవశౌర్యుండు భైరవుండు
శ్రీకరాకారుండు చినతిమ్మధీరుండు
నాగేంద్రనిభకీర్తి నాగవిభుఁడు
భాస్కరతేజోవిభాసి భాస్కరమంత్రి
వినయధన్యుండు గోవిందశౌరి
హిమభూమిధరధైర్యుఁ డెల్లప్రధానుండు
ధీవిశాలుఁడు పాపదీయఘనుఁడు
తే. వీర లెనమండ్రు దిగ్గజాకారు లగుచు
వైభవంబున వెలసిరి వసుధలోన
లోకనుతమూర్తి ముడియములోకదండ
నాథగర్భసుధాబ్ధిమందారతరులు. 46

క. ఈదండనాథమణుల స
హోదరులై పుణ్యలక్షణోజ్జ్వలమూర్తుల్
మాదాంబయు గంగాంబయు
భూదుగ్ధపయోధిసుతలఁ బోలిరి జగతిన్. 47

మ. తనసత్కీర్తిలతామతల్లికలు దిగ్దంతావళోదగ్రకుం
భనికుంజంబులు తాఁక శౌర్యము రిపుప్రాణప్రయాణార్థిగా
ఘనదోఃస్తంభము కూర్మశేషమహిభృత్కౌతూహలాపాదిగాఁ
దనరెన్ లోకయపాపదీయన సురేంద్రప్రాభవప్రక్రియన్. 48