పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తే. సారె వీణావినోదంబు సలుపువాణి
సైకతశ్రేణి జలరుహాసనునిరాణి
మహిమ ముడియము లోకయామాత్యచంద్రు
భాస్కరునిఁ జేయు భాగ్యసంపన్నుఁ గాగ[1]. 8
 
ఉ. ఎవ్వనియాజ్ఞ మౌళిఁ బ్రియ నెప్పుడుఁ దాల్చినవాఁడు శంకరుం
డెవ్వని మాయఁ జిక్కువడ కెక్కటి నింద్రునకైనఁ దోఁపరా
దెవ్వని పేర్మి వర్ణనల కెక్కు జగత్త్రితయైకధన్వి నా
నవ్వెడవిల్తు గొల్తుఁ గృతి యాదిఁ గవిత్వమహత్వసిద్ధికిన్. 9

వ. అని యిష్టదేవతా ప్రార్థనం బొనరించి. 10

సుకవి స్తుతి


ఉ. వ్యాసమునీంద్రు భారతకథాంబుధిచంద్రు భజించి ధీరమో
పాసకు నాకుజుం బొగడి బాణుని కౌఁదల వంచి కాళికా
దాసు నుతించి భారవి ముదం బెసఁగం గొనియాడి మాఘునిన్
వాసిగఁ జూచి భామహుని వర్ణన చేసెదఁ గావ్యసిద్ధికిన్. 11

ఉ. చేతులమోడ్పు నెన్నొసలఁ జేర్చి తలంచెద నన్నపార్యు న
త్యాతతభక్తియుక్తిఁ గొనియాడెదఁ దిక్కన సోమయాజి ను
ద్గీతవచోవిరూఢి వినుతించెద నెఱ్ఱనమంత్రిశేఖరుం
బ్రీతి వహించెదన్[2] హృదయపీఠిక వేములవాడ భీమునిన్. 12
 

కుకవినింద


చ. కుఱకుఱ పోకలం బొదలి కోపము గర్వము మున్ను గాఁగఁ దా
నెఱుఁగనిచోటు తప్పనుటయే కడునెమ్మిగఁ జూచు దుర్జనుం
డఱచిన సత్కవీశ్వరున కౌనె కొఱంతయు హాని[3] యీసునన్
మొఱుగద కుక్క గంధగజముం గని కర్ణకఠోరభాంకృతిన్. 13
 
14. వ అని సుకవి నమస్కరణంబును గుకవి తిరస్కరణంబునుం గావించి. 14



  1. భాస్కరుని భాగ్యసంపన్ను జేయుగాత
  2. వచించెదన్, ఖచించెదన్
  3. వలాని