Jump to content

పుట:ఆముక్తమాల్యద.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆముక్తమాల్యద

(విష్ణుచిత్తీయము)

ఉపోద్ఘాతము

కృతి : కృతికర్త

కృతి గుణవిశేషములకు కృతికర్త ప్రతిభాపాండిత్యాదులవలెనే తజ్జీవితవిధానమును అప్పటి దేశకాలపరిస్థితులును కొంత కారణ మని విమర్శకనిపుణులు చెప్పుదురు. 'Periclean age' 'Augustan age' 'Elizabethian age' 'Victorian age 'Gupta golden age' అని యిట్టిపేరులు వినంబడుచుండును. అవి దేశకాలపరిస్థితి జ్ఞాపకములె. అట్లే ఆష్టదిగ్గజములం బ్రఖ్యాతము అని కృష్ణదేవరాయలకాలమునకును గొప్పపేరుప్రసిద్ధులు గలపు. మఱియు దైవికముగను ఒక్కొక్కప్పుడు గొప్పకవులు పుట్టుదురు. నాఁటి చరిత్రచర్చ నేఁడు వలదు కాని, తేలినవిషయమును ఇట్లు ఉదాహరింపఁదగును.

వంశపరంపరగా విజయనగరమునకు నరసింహప్రభుని యనంతరము అతని పెద్దకొమారుఁడు వీరనరసింహుఁడు కొంతకాల మేలి చనిపోగా తదనంతరము చిన్నకొమారుఁడు కృష్ణదేవరాయఁడు ముప్పయైదేండ్లవాఁడు మంచియనుభవశాలి క్రీ. శ. 1509 లో రాజ్యపట్టాభిషిక్తుఁ డాయెను. టెంకణాదిత్యుఁడు నన్నెచోడుఁడును నెల్లూరిదొర మనుమసిద్ధియు తాము సూర్యవంశమువారు అను నభిమానము వహించినట్లు 'కలశపాథోరాశి గర్భవీచిమతల్లి కడుపార నెవ్వాని గన్నతల్లి' అని యాచంద్రునివంశమువాఁడు తాను అని కృష్ణదేవరాయఁడును అభిమానము వహించినవాఁడు. పటాభిషేకము కాఁగానే అతఁడు తొడంగి కడంగి దిగ్విజయము చేసి దక్షిణభారతమందు క్రీ శ.1620 నాఁటికి తనప్రభావమును సుప్రతిష్ఠితము గావించి, ఉత్తరభారతమున సైతము లోడీ సుల్తానులను తనకు అరిగాపులు గావించుకొని అభ్యుదయపరమోచ్ఛ్రితిం బొందెను. అట్టి యభ్యుదయకాలము దేశమున నిజముగా గొప్పకవులయు కావ్యములయు కాలముగా నుండును. కళలును శిల్పములును విశేషవికాసము పొందును. అన్నింటికిని విజయోత్సాహి యగు రాజు నాదరము పోషణ