Jump to content

పుట:ఆముక్తమాల్యద.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యుండును. అట్లే గదా, వీరుఁడును జేతయు నగు కృష్ణదేవరాయఁడు తాను గొప్పపండితుఁడును మహాప్రతిభాశాలియు మహాకవియు, వీణావాదనాదికళలందును ఆరితేఱినవాఁడు కవిపోషకుఁడు కాకుండునా? అన్నిభాషలకవులు కళాభిజ్ఞులను పోషించుటయు కాక, అష్టదిగ్గజములు అను ఎనమండుగురు ఆంధ్రమహాకవులను, వారికి తనయాస్థానమున పే ర్వేఱ స్థానాసనములు ఏర్పఱిచి నిత్యకవితాగోష్ఠులు సమకూర్చుచు ఆనందించుచుండెను. వీనిచేత రాయల లోకానుభవము లోకవిశాలమును సాగరగంభీరమును అగుననుటకు సందియ మేమి? ఎటు గన్నను ఆరాజ్యమున ఒక తృప్తి ఒకయుత్సాహము ఒకపొంగు మిన్నంది వెలుంగుచుండెను.

మఱియొక విషయము. కృష్ణదేవరాయుఁడు మతమున వీరవైష్ణవుఁ డాయెను. ఆయన ప్రియమిత్రులు ఆస్థానకవిచక్రవర్తియు నగు పెద్దనయు వీరవైష్ణవుఁ డాయెను. ఆమతావేశమును ఒకయసాధారణమహోత్సాహమును పెంపొందించును. అది యట్టిమతావేశకాల మని కృష్ణదేవరాయఁడు తన గ్రంథాంతమున ప్రస్తావము తెచ్చి ఒకశఠకోపయతిని వర్ణించుచు సూటిగాను విలక్షణముగాను సూచించినాఁడు (చూ VI-66). "అతంత యిటమీఁద యాదవగిరి టెంకణంబు పాషండసంకులంబు గావచ్చినఁ, దచ్చ్యుతికి శఠకోపసమాఖ్య సంభవించి నీరంధ్రవాదంబున నంధ్రాదివిషయవిద్వజ్జనంబుల నధోక్షజవిషయవాదభిక్ష వేఁడి దిగ్విజయంబు సేసి గరుడకుధరగుహాకుంఠనృకంఠీరవంబు కుహనాత్రిదండియై బ్రుసీకుసుంభాంబరాంభఃకుండిక లొసంగ నంగీకృతాంతిమాశ్రముండై, ఫణిప కణభుగక్షపాద బాదరాయణ కపిల జైమిని శాసనంబులు మఠమహాసనమహీసురులు మున్నుగా నెంతే వాసి నంతేవాసులకుఁ దెలివిపఱుపం బరమహంసానుష్ఠానపరకాష్టయై, పదయుగప్రసన్నభువనప్రపంచపంచజనహృదయభవనంబులం బద్మాపద్మాక్షులు వల్లేర్లు దుడిచి పాడెక్క భక్తి బోధించి భూతలంబుఁ బావనంబు సేయగలవాఁడు" అని. క్రీస్తు శకము 1200 నాటికే శ్రీరామానుజాచార్యుల మతదిగ్విజయము ముగిసి, వైష్ణవమతమునకు సకలాభ్యుదయములు గూడి దక్షిణభారతక్షేత్రములకు దేవళములకు జనులకు వ్యాపించి బలము గొనుచుండెను. తరువాతను అప్పుడప్పుడు గొప్పగొప్ప యాచార్యులు ప్రభవించుచు దాని బలమును వ్యాప్తిని పెంపొందించుచుండిరి. ఆమార్గమున రాయలికాలమున ఒకక్రొత్తయతీశ్వరుఁడు శఠకోపముని అహోబలమున మఠము స్థాపించి విశేషముగా 'నీరంధ్రవాదమున ఆంధ్రాదివిషయవిద్వజ్జనములను' తనమతమున కలుపుకొని రాజుల నందఱిని