Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యా. 2]

ఉపక్రమము.

13

శ్రీమద్భగవద్గీతయందు చేసిన యుపదేశములో తనయొక్క తత్త్వమును తానే బోధించియున్న వివరమును కొంత విచారింతము.


భూమిరాపో౽నలోవాయుః ఖం మనో బుద్ధిరేవ చ।
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టధా ॥
అపరేయ మితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం ।
జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ ॥
                               (భ. గీ. 7-4, 5.)


పృథివ్యాది పంచభూతములును వానికిపై మూడుతత్త్వములును వెరసి ఎనిమిది విధములయినది నాయొక్క ఒక ప్రకృతి. దీనికి అపరాప్రకృతి యని పేరు. ఇంతకంటె నధికమైన మరియొక ప్రకృతి కలదు. దానికి పరాప్రకృతి యని పేరు. ఇది జీవము వంటిది. ఇదే స్థూలసూక్ష్మప్రపంచముల నన్నిటిని ధారణవల్ల కాపాడునది. చరాచరాత్మకము అయినదియు దృశ్యములు అదృశ్యములు అగు స్థావరజంగమాది మనుష్య దైవ దానవాది రూపములనన్నిటికిని ఉపాదానకారణమైనది అపరాప్రకృతి. భూలోకముమొదలు సత్యలోకపర్యంతమును గల సకలలోకములకును ఈ అపరాప్రకృతియే కారణము.

అధిభూతం క్షరోభావః

అని యెనిమిదవ యధ్యాయమునందు చెప్పినది యీ ప్రకృతియే. ఈ స్వభావమునే, ఈ అపరాప్రకృతినే, గీతయందనేక స్థలముల యందు "వ్యక్తయః" అను పదముచే వ్యవహరించియున్నారు. (అవ్యక్తాద్వ్యక్తయ స్సర్వే ప్రభవంత్యహరాగమే).