Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

300

ఆత్మవిచారము

[7 వ

చున్నాము అను దృఢజ్ఞానము మనకు పుట్టవలెను. నిద్రలోనైనను మనకు ఈ విషయమందు సందేహము ఉండకూడదు. ఈ దృఢనిశ్చయము మనకు పుట్టకుంటే మనము సుఖమును అనుభవించలేము. ఉత్తరోత్తర మనము నివృత్తిమార్గమును అనుష్ఠించునపుడు "క్రోడీకరోతి ప్రభుః" అను వాక్యము ప్రకారము బలహీనులు పదిజన్మములయందు అనుభవించునంతకర్మను మనకు ఒకటే జన్మమునందు క్రోడీకరించి కర్మదేవతలు ఇత్తురు. కర్మ అంతయు అనుభవించి ముగియునంతవరకును మనకు జ్ఞానదీక్షలు రావు. జ్ఞానదీక్షలన్నియు వచ్చినగాని జీవన్ముక్తిరాదు. కనుక కర్మక్షయము పరిపూర్ణముగా కావలయును. కొన్ని జన్మములలోనే శిలుకునిలిచిన కర్మనంతయు ననుభవించవలసినదిగా వచ్చును. సంతోషమైనను దుఃఖము అయినను అపరిమితముగా ప్రాప్తించును. అపరిమితసంతోషము వచ్చినపుడు ఏవిధముగానైనను సహించుకొందుముగాని అపరిమితమగు దుఃఖము వచ్చినపుడు సహన యుండదు. సహన లేకపోయి ఏడ్చినపుడు కొత్తకర్మ ఉద్భవించును. కనుక సహనకు తెలివి ముఖ్యము. "దుఃఖేష్వనుద్విగ్నమనా:" అనియు "నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు" అనియును చెప్పియున్నగుణములు అనుష్ఠానమునకు వచ్చినగాని సంసారబంధవిముక్తి కాదు. ఇట్టితెలివి అనునదే కర్మవిషయికజ్ఞానము. కనుక పదేపదే మననముచేసి "అవశ్యమనుబోక్తవ్యం కృతం కర్మ శుభా౽శుభం" అని శాంతిచెందు స్వభావమును వృద్ధిపరుచుకొని సుఖమును అనుభవించవలెను.