అధ్యా. 6
సంసారచక్రము
211
(సుబాలోపనిషత్తు). మనుష్యులకందరకును ఇట్లు సూక్ష్మరూపములు గలవు. రూపమున్నపుడు నామముకూడ యుండవలసినది అని ఛాందోగ్యోపనిషద్వాక్యమువల్ల తెలియుచున్నది. కనుక మనుష్యునికి వ్యవహారనామము కాక వేరు పేళ్లుండవలెను. సూక్ష్మలోకములలో ఆయా లోకవ్యవహారమునకు ఒక్కొక నామధేయముండును. జ్ఞానప్రదులైన గురువులు రహస్యనామధేయములతోనే తమశిష్యులను పిలుతురు.
సంగీతశాస్త్రమునందు షడ్జ, ఋషభ, గాంధారాది స్వరములను సూచించువర్ణములు స రి గ మ ప ద ని యని ఏడు వర్ణములున్నవి. ఈ స్వరములలో నొక్కొకటి యొక రాగముగా నుపయోగించవచ్చును. అన్నియు కలిసినపుడు సంగీతగ్రామము కట్టును. అదే విధముగా లయాత్మ, కాలాత్మ, యిట్టి యాత్మలకు వేరు వేరు స్వరములు కలవు. ఇవన్నియు కలిసి గ్రామము కట్టిన ప్రకారము తురీయాత్మనామ మేర్పడును.
స్వరములనన్నిటిని వీణయొక్క తంత్రులవల్ల శబ్దింప చేయవచ్చును. ఒక్కొక స్వరమునకు ఒక్కొక తంతెయున్నదనుకొందము. గాంధారస్వరమునియ్యగల తంతెను మీటినపుడు గాంధార స్వరము మాత్రము శబ్దించును. అనగా ఆ తంతెయొక్క స్పందశక్తి గాంధారము. ఇదే విధమున మరియొక తంతెయొక్క స్పందశక్తి ఋషభము. మరియొక తంతెయొక్క స్పందశక్తి షడ్జము. ఈ విధముగా ఆ యా తంతెయొక్క స్పందశక్తివల్ల ఒక్కొక స్వరమును వాయించగలదు. లోకమంతయు స్పందమయము. శబ్దము ఒక తరహా స్పందము. స్పర్శము ఒక తరహా స్పందము.