Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యా 5]

ప్రవృత్తిమార్గము

189

నములు ఒక జాతివి. మనము జపతపములు కొద్దిగా జేసి తన్మూలముగా కొంతమట్టుకును సత్త్వగుణము నార్జించుకొని యున్నయెడల అంతమాత్రమునకే మనయందు విరోధమును చూపుచు మనయొక్క సత్వగుణమును శిథిలపరచుటకుగా మన మేమరి నిద్రపోవుసమయమున మనశరీరమునందు ప్రవేశించి చెడుపు కలుగజేయు నుద్దేశముగల చెడ్డచేతనములుగూడ కొన్ని గలవు. కనుక కొంత మట్టుకు మనము చెడ్డచేతనములబాధను నివారించుటకై రాత్రులయందు నిద్రించుటకు ముందు దిగ్బంధము చేసికొని నిద్రించుట యొక సంప్రదాయము.

మరియు దుశ్చేష్ట లగు కల్లు, సారాయి, నల్లమందు, భంగి మొదలగువాటిని యుపయోగించుట, వ్యభిచారము మొదలగు దుర్నడతలకు లోబడుట, మొదలుగా గల దుస్స్వభావములు గలిగియుండి తనను తాను దిద్దుకొనుటకు ప్రయత్నపడువారలు ప్రాయశః దుష్టచేతనములబాధలకు భయపడవలసినది. దుష్కార్యములు చేయుచున్న కాలమందు భువర్లోకసంచారులగు దుష్టచేతనములు దుస్స్వభావముగలవానికి సహాయభూతములుగా నుండిరి. చెడ్డపనులు మానుకోవలె నని ప్రయత్నముచేయ నారంభించగానే ఆ చెడ్డచేతనములకు ఇన్నాళ్లును ఆశ్రయముగా నుండిన దుర్మార్గుడు సన్మార్గము నవలంబించితే తమకు ఆశ్రయము లేకపోవునుగదా యని దుఃఖించు చేతనములు అతని ప్రయత్నములను కొనసాగనీయక చేయు నుద్దేశముతో సకల ప్రయత్నములు చేయును. పై ప్రస్తావించిన చెడ్డచేతనములు దుర్మార్గమువదలి సన్మార్గము నవలంబించువాని శరీరములకు కీడును కలుగ జేయును.