అధ్యా 5]
ప్రవృత్తిమార్గము
183
యూరడింపు మాటలు నన్నియు మాటలాడవలయును. ఈకార్యముయొక్క ప్రయోజన మేమిగా పరిణమించు ననిన, దుఃఖియొక్క మనస్సునందు కొంత కొంతగా కొన్నాళ్లకు దుఃఖము తగ్గును. ఏమి యిది యాశ్చర్యము ; ఈ విధమైన మన సహాయముతో నింతప్రయోజనము కలుగునా యని శంకింపవలదు. ఇందుకు శ్రీమహాభారతము ఆదిపర్వమందు మరియొక విధమైనదృష్టాంత మున్నది. పాండవులును కౌరవులును శ్రీద్రోణాచార్యులవారివద్ద నస్త్రవిద్యాభ్యాసము చేయుచుండినపుడు ఏకలవ్యు డను బోయవా డొకడు అస్త్రవిద్యార్థియై ద్రోణాచార్యులవారి నాశ్రయించి అస్త్రవిద్య చెప్పియిమ్మని వేడుకొనెను. వారు విద్యను చెప్పి యివ్వననిరి. అంత ఏకలవ్యుడు తన యర్యణమునకు వెళ్లి అచ్చట ద్రోణాచార్యులవారి రూపమొక్కటి మట్టితో సిద్ధపరిచి ఆరూపమునకు పూజలుచేసి దానినే గురువుగా భావించి అస్త్రములు నభ్యసించుచు వచ్చి నిజమైన ద్రోణాచార్యులవారిగుండా వారియొక్క శిష్యులు నేర్చుకొన్న విద్యల నన్నిటిని తానును నేర్చెనని విందుముకదా. ఈ కథయందు ఏకలవ్యుడు ఏకాగ్రచిత్తుడై ద్రోణాచార్యులవారిని స్మరించి తాను లాభము పొందెను. అదేప్రకారము మనమందరమును ఏకాగ్రచిత్తత సంపాదించి పరహితమును చేయవలెను. ఎప్పుడైనను పరపీడనమునకు గాని స్వహితమునకు గాని మనశ్శక్తిని ఉపయోగించకూడదు. ఈవిధముగా పరులకు మితిలేనంత సహాయము చేయుశక్తిని, భూతానుకంపయను గుణమును, ప్రియవాదిత యనుగుణమును అభ్యసించి పరమేశ్వరుని దూతలుగా ప్రచ్ఛన్నులుగా సేవించవచ్చును.