170
ఆత్మవిచారము
[5 వ
నొక విధమైన మార్పును చూపును. సంతోషము కలిగినపుడు చిరునవ్వును ముఖమునందు శాంతియు కనపడును. కోపము వచ్చినపుడు ముఖమునందు రక్తమధికముగాఁ జేరి ముఖము మట మట లాడుచుండును గదా. ఇందువల్ల మనస్సునందుఁ పుట్టిన మార్పులు మనస్సులోనే నిలువక స్థూలశరీరమందు కూడ అట్టి మార్పులను చూపును అని తెలిసికొనవలెను. అదే విధముగా చిత్తైకాగ్రత నారంభించవలెనన్నపుడు స్థూలశరీర మొకవిధముగ బిగుతును చెందును. శరీరమందుండు మాంసకండలు బిగువెక్కి కనుబొమలు ముడిపడి ఎవనితోనో శత్రువుతో కొట్లాడ నుద్దేశించు వానివలె ముఖమునందును, శరీరమునందును, మెడయందును ఒక విధమైన బిగుతు గలుగును. ఇది కూడదు. కొంతదూరము అనగా పదినిమిషములు ప్రయత్నము చేయునప్పటికి మెడనరములును, వీపులోనును నొప్పి కలుగును. క్రమేణ తలనొప్పి పుట్టును. ఇట్టి దురవస్థల కవశ్యములేదు. శాంతముగా, సుఖముగా, సంతోషముగా ననుష్ఠాన మారంభించి నడుపవలెను. మనస్సును అంతకంటె బలశాలియైన కరణముచే జయించవలెనే గాని మనస్సునకంటె బలహీనమైన స్థూలశరీరముచే జయించుటకు సాధ్యముగాదు. గనుక స్థూలశరీరమందు వికారములు పుట్టకూడదు.
ఆధ్యాత్మ విద్యాధిగమః సాధుసంగమ ఏవ చ ।
వాసనాసంపరిత్యాగః ప్రాణస్పంద నిరోధనం ।
ఏతా స్తాయుక్తయః పుష్టా స్సంతి చిత్తజయే కిల ।
(జీవన్ముక్తివివేకము)