142
ఆత్మవిచారము
[5 వ
వలెనుగదా. అట్టి చూచువారు జీవాత్మలు, అనగా మనము. చూచువానికి "ద్రష్ట” యనిపేరు. ద్రష్ట చూచును, దృశ్యము చూడబడును, ఈ రెంటికిని చూపు అను సంబంధ ముండవలెను. ఈ చూపుకు "దృష్టి" యని పేరు. ద్రష్టా, దృశ్యము, దృష్టియను మూడును ఇపుడు త్రిపుటి యనబడు. ఇదేవిధముగా మరియొక త్రిపుటి కలదు. "జ్ఞాతా” అనగా ఎరుగువాడు, "జ్ఞేయం” అనగా నెరుగబడు వస్తువు, “జ్ఞానం” అనగా నెరుగునట్టి శక్తి. ఇపుడు ఏర్పడిన త్రిపుటి ఏమనగా "జ్ఞాతా, జ్ఞానం, జేయం" అనునది. ఈ త్రిపుటియందు జ్ఞానం అను నంశము క్రింద నొకభాగము అంతఃకరణము. జీవాత్మలు జగత్తు నెరుగవలెనంటే అంతఃకరణము ముఖ్యసాధనము. బహిఃప్రపంచమందు గల శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు మొదలగునవి విషయములని పేరుగొన్నవి యని ముందేచెప్పబడెను కదా.
విషయములను ఇంద్రియములు గ్రహించును. ఇంద్రియములు గ్రహించినవిషయములను ఆత్మ అంగీకరించవలెనంటే ఆత్మకును ప్రపంచమునకును మధ్యవర్తియొక రుండవలెను; అట్టి మధ్యవర్తి యంతఃకరణము. ఒకానొక రాజువద్దకు అర్జీదారులు పోవలెనంటే రాజుగారికి అర్జీదారుల ప్రార్థనను మనివిచేయు మధ్యవర్తియైన యధికారి యొకమంత్రి యున్నట్టు క్షేత్రజ్ఞుడైన జీవాత్మకును బహిఃప్రపంచమునకును మధ్యవర్తి యంతఃకరణము. ఆత్మ సత్పదార్థము, ప్రపంచము అసత్పదార్థము. ఈ రెంటికిని మధ్యవర్తి యంతఃకరణము. ఇదే యర్థము జ్ఞానవాసిష్ఠమందు చెప్పబడియున్నది.