పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రమాణశూన్యమైన కల్పితవాదము. రెండవది వాదమని చెప్పతగదు. అది సప్రమాణమై పూర్వచరిత్రచే నిర్ధారణచేయబడిన సిద్ధాంతము. అది సత్యమైన చరిత్ర.

ఆంధ్రము తెలుగు వేఱు కావు

ఆంధ్రము, తెలుగు వేరనెడి వాదమును గురించిన విమర్శ అనావశ్యకము. ఆంధ్రులనుగురించిన చరిత్ర పూర్వచరిత్రాధారమున ధ్రువపడినచో ఈ భాషావాదము దానియంతట నదియే సమసిపోగలదు. ఆంధ్రమే తెలుగు. తెలుగే ఆంధ్రము. అవి రెండు కావు. తెలుగుభాషనే ఆంధ్రభాష యని కొందరును, తెలుగుభాష యని కొందరును వాడియుండిరి. వాటిని వేరువేరు భాషలుగా నెంచుట పొరబాటు. కాలము గడుచుచురాగా భాషలోగూడ పదవ్యత్యాసము లేర్పడినవి.

శాసనములలో గల భాషనుబట్టి ప్రజలంద రాకాలములో ఆభాషనే మాటలాడుచుండి రని ఊహించుట పొరబాటు. ప్రజలభాష ఆంధ్రము లేక తెలుగుగా నున్నను శాసనములు సంస్కృతములో గాని, ప్రాకృతములో గాని వ్రాయించవచ్చును. అంతమాత్రమున శాసనములలోని భాషయే ఆకాలమున నాప్రాంతీయప్రజలు మాటలాడుచుండి రని యెంచుట న్యాయముగా లేదు. ఆ శాసనములు వ్రాయించినది. ప్రజలు కారు. ఏదియో యొకప్రాంతపు రాజో, లేక యొక దాతయో యైయుందురు. అందువలన ఆశాసనములో ఏభాష నుపయోగించవలయు నను విషయ మా శాసనకర్తయొక్క రుచిని, ఇష్టమును అనుసరించి యుండును. శాసనకర్తలకును ప్రజలకును ఎట్టి సంబంధమును ఉండదు. శాసనకర్తలు శాసన భాషను గురించి ప్రజలతో సంప్రదించ నవసరము లేదు. అట్లు పూర్వ శాసనములు వ్రాయించినప్పుడు ప్రజల కంగీకారమైన భాషలో శాసనములు వేయబడినట్లు ఎట్టి ప్రమాణమును ఇంతవఱకు దొరకియుండ లేదు. కాబట్టి శాసనములలోని లిపిలిబట్టి ఆకాలములోని ప్రజల భాష శాసనభాషయే యని నిర్ధారణచేయుటకు వీలు లేదు.