పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వర్షమే ప్రథమమున ఆర్యులనెడి మానవజాతి ఉత్పత్తిని బొంది నివసించిన స్థలము. అందువలననే ఈ భారతవర్షమునకు 'ఆర్యావర్త'మను పేరు కలిగినది. మానవజాతి నివసించుటకు ప్రథమస్థానముగా దేవతలచే నిర్దేశింపబడినందున భారతవర్షము 'ఆర్యావర్త: పుణ్యభూమి:' అను సార్థకనామము నందినది. అట్టి పుణ్యభూమి యైన భారతవర్షమున ఆర్యులు పుట్టి క్రమక్రమముగా భారతవర్షమందంతటను వ్యాపించి నివసించిరి. అట్లు వ్యాపించిన ఆర్యులలో బంగాళారాష్ట్రమున కుత్తరపు హద్దునుండి మద్రాసుపట్టణమునకు దక్షిణపు సరిహద్దువఱకు వ్యాపించిన ఆర్యులు ప్రాచ్యదేశీయు లనియు, వారు నివసించిన భూమి 'ప్రాచ్యకరాజ్య' మనియు పిలువబడినది. కాలము గడచుచురాగా ఒకానొకకాలమున అట్టి ప్రాచ్యక రాజ్యము నేలెడి రాజు 'బలి' యనువాని కుమారు లాదేశము నాఱుభాగములుగ చేసి పంచుకొని తమపేరుల నాదేశ భాగముల కుంచి పరిపాలించిరి. వారు పంచుకొనునాటి కందు చాతుర్వర్ణ్యస్థులగు ఆర్యులును, వారి ననుసరించి యుండిన అంతర్వర్ణశాఖలును గలవు. ఆంధ్రరాజు తనభాగమునకు 'ఆంధ్రదేశ'మని పేరు పెట్టియుండెను. దేశనామమునుబట్టి ప్రాచ్యదేశీయు లని పిలువబడెడి ఆర్యజాతివారందరు నూతనదేశనామముచే 'ఆంధ్రులు' అనెడి నామాంతరమును బొందిరి. అదేవిధమున వారి భాషయైన తెలుగుభాష 'ఆంధ్రభాష' యనెడి నామాంతరమును బొందినది. కనుక ఆంధ్రుల చరిత్ర యనగా ఆరుల చరిత్రయే యైయున్నది. వీరలే కాదు - ప్రపంచములో నేజాతివారైనను - సత్యమైన తమ యుత్పత్తి చరిత్ర వ్రాసికొనవలయుననిన ఆర్యావర్తమున 'ఆర్యుల' యుత్పత్తిచరిత్రతోడనే ప్రారంభించి తమ శాఖ చీలి నామాంతరాదికమునొందువఱకు వ్రాసికొనవలసియుండును.

ఇట్లు,
గ్రంథకర్త.
విజయవాడ
15-2-1955