పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్రాయునపుడు వాటిప్రశంస రాగలదు. గ్రంధవిస్తరభీతిచే ఇచట నవి ఈయబడలేదు.

ఆర్య శాఖలు

భరత ఖండమున వివిధ రాష్ట్రములలో నివసించుచుండినదియు వర్ణాశ్రమ ధర్మముల ననుసరించుచు వైదిక ధర్మముల నాచరించునదియునగు ప్రజా సమూహ మంతయు ఆర్యజాతియులై యుండిరి. ఉత్తరప్రదేశ్ లో హిందీ మాటలాడెడివారలును, బెంగాలులోని బెంగాలీలును, బీహారీలును, కళింగులును, ఓడ్రులును, సుంహ్ములును, పుండ్రులును, ఆంధ్రదేశములోని ఆంధ్రులును, ద్రవిడ దేశములోని తమిళులును, కేరళులును, కర్నాటకులును, మహారాష్ట్రులు, పాంచాలురు, మద్రులు, కాంభోజులు, గాంధారులు, కాశ్మీరులు, నేపాలీలు, త్రిగర్తులు మొదలుగాగల భారతీయులందరును స్వచ్ఛమైన ఆర్యజాతివారలై యుండిరి. వారితోబాటు వారియందు అనులోమవిలోమ సాంకర్యమున జనించిన మిశ్రమ కులములవారు కూడ వారిప్రక్కనే నివసించుచు వారికి నిత్య జీవితమున సర్వ విధముల తోడ్పడుచు జీవించుచుండిరి.

మ్లేచ్ఛులుగా పరిగణింప బడిన శాఖలు:

పౌండ్రకులు, ఓడ్రులు, ద్రవిడులు, కాంభోజులు, యవనులు, శకులు, పారదులు, పల్హవులు, చీనులు, కిరాతులు, దరదులు, ఖళులు, బర్బరులు, హారులు, హూణులు, పరశకులు, బాహ్లికులు మొదలయిన క్షత్రియశాఖలును యయాతికుమారులలో తుర్వసుని సంతానము నూరుగురును పశ్చిమోత్తర భారతమున, పశ్చిమ ఆసియాలోని రాష్ట్రములకు ప్రభువులై అచ్చటనే స్థిరపడిన వారి సంతాన పరంపరలును మ్లేచ్ఛులుగా పరిగణింపబడిరి. తుర్వసుని సంతానము తుర్వసులనియు లేక తురుష్కులనియు పిలువబడిరి. వీరిచే ఆక్రమింపబడిన దేశములు తురుష్క స్థానము (Turkey) రష్యన్ తురుష్కసానము (Russian Turkistan) అయియున్నవి. ఇటీవలికాలమున క్రీ. శ. 11, 12 శతాబ్దములలో వీరు మహమ్మదీయులుగా చేయబడిరి.