పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజపుత్రు లనబడు శాఖలన్నియు ఆంధ్ర శాతవాహన వంశమునకు చెందిన బ్రాహ్మణశాఖలు. వీరికి రాణాలనునది బిరుదనామము. వీరందరును దేశములను కొల్లగొట్టి స్త్రీ బాల వధాదులను చేయుచు తిరుగు చుండెడి హూణ, ఘూర్జరులను మ్లేచ్ఛులకు పుట్టినవారని పాశ్చాత్య పండితులును వారి ననుసరించి భండార్కరుగారును వ్రాసియుండిరి. దానిమీద పండిట్ మోహన్‌లాల్ విష్ణులాల్ పాండియా అనెడి పండితుడు పైవారి వ్రాతలను ఖండించుచు గ్రంథమును వ్రాసి రాజపుటానాలోని రాణాలందరును బ్రహ్మక్షత్ర వంశమునకు చెందిన బ్రాహ్మణులనియు, వారు వల్లభిరాజ వంశర్థు లనియు, డెబ్బదిఅయిదు సంవత్సరముల క్రిందటనే ఋజువు పరచియుండెను.

క్రీస్తుపూర్వము 1218 సంవత్సరమునుండి క్రీస్తుపూర్వము 833 సంవత్సరమువరకును రాజ్యముచేసిన శుంగ, కాణ్వ వంశములు రెండును బ్రాహ్మణ వంశములు. అందు శుంగవంశపు మూలపురుషుడు 'శుంగ భారద్వాజ' సగోత్రుడైన ఆంధ్ర బ్రాహ్మణు డని కొంద రనుచున్నారు. అనేకులు చరిత్రకారు లావిషయమున మూకీభావము వహించిరి. కాణ్వ రాజులు ఆంధ్రులే ఐయున్నారు. ఈవిషయమును గురించి కణ్వశాఖీయుడగు శ్రీకనుపూరి సీతారామయ్యగారు ఇట్లు వ్రాయుచున్నారు:-

కాణ్వ శాఖ వారాంధ్రులు

కణ్వమహర్షి మన దేశభాష యగు నాంధ్రభాషకు వ్యాకరణమును రచించియున్నాడు.

"అధోక్షజ ఫక్కిక" యనెడి ఆంధ్ర వ్యాకరణ గ్రంథమునందు ఆంధ్ర వ్యాకరణ కర్తలు ఇట్లు పేర్కొనబడిరి:-

            "వాక్పతిం పుష్పదంతం చ కాణ్వం సోమ మధర్వణమ్||
             హేమచంద్రం సమస్కృత్య వక్ష్యేధోక్షజ ఫక్కికామ్||"
మఱియు:-
           "బార్హస్పత్యాని సర్వాణి కాణ్వం వ్యాకరణం విదు: |
             కరోమ్యధర్వణంశబ్దం సర్వలక్షణలక్షి తమ్||" (అథర్వణకారికులు)