పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11. శివపురపు బ్రహ్మయ్య లింగారాధ్యులు:- వీరిది కౌండిన్యస గోత్రము. వెంకటగిరి ప్రభువుచే సన్మానింపబడి "కుంకుపాడు" అను అగ్రహారమును పొందెను (ఇది వినుకొండ తాలూకాలోనిది). ఈయన గారు అక్కన్న, మాదన్నల కాలపువాడు. ఈయనగారి వంశీయులు "శివపురపు" వారను ఇంటిపేరున పిలువబడుచున్నారు.

వీర శైవ మతము

శైవ మతస్థులలో సంఘ సంస్కార మొనర్చినవారు గలరు. వీరు వర్ణాశ్రమాచారముల వదలి, "లింగధారు" లైన వారందరును ఒకటే కులమని అనెడివారు. దీనికి "వీర శైవ మత" మని పేరు. వీరు మత, సంఘ సంస్కారులు. వర్ణాశ్రమ ధర్మ భేదములను పాటింపరు. ఈ మత స్థాపకుడు, 'బసవేశ్వరుడు'. ఈతడు ఆంధ్రుడు. నియోగి బ్రాహ్మణుడు. ఇంటిపేరు బండారువారు. వీరి కాపురము తెలంగాణాలోని "కల్యాణపురము". బిజ్జలరాజు పరిపాలనకాలములో బసవేశ్వరుడు ఆయనవద్ద మంత్రిగా నుండియుండెను. (క్రీస్తుశకము 12 వ శతాబ్దము). ఈతడు సంఘ సంస్కారి యై కులభేదములను పాటింపక లింగధారణ మాత్రమే చాలునని వైదిక సంస్కారములైన "ఉపనయనాది సంస్కారము" లను త్యజించియున్నాడు. ఈతని మేనమామ యగు "బలదేవ మంత్రి" తాను వైదిక ధర్మావలంబి యయ్యు తనకుమార్తెను మేనల్లుడైన బసవేశ్వరున కిచ్చి వివాహము మొనర్చియున్నాడు. అందువలన బ్రాహ్మణసంఘమునుండి వీరుభయులును బహిష్కరింపబడిరి. ఈ బసవేశ్వరుని మత మవలంబించిన వారందరు 'లింగాయతు' లనియు, వారి మతమునకు "లింగాయతు" మతము లేక "వీరశైవ" మత మనియు పేరులు. లింగాయతులు లింగబలిజలని పిలువబడుచున్నారు.

రాజ పుత్రులు

రాజపుటానాలో అల్ప రాజ్యములను కల్పించి ఈయబడిన ఆంధ్ర శాతవాహన చక్రవర్తుల కుమారులును ఇతర రాజబంధువులును