పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. పల్లినాధుడు:- ఈయన ఏకోరామారాధ్యుని కుమారుడు. ఈయన కొలనుపాకలో ఒక తటాకమును త్రవ్వించి గ్రీష్మకాలములో ఒక రాజుయొక్క దప్పిని దీర్చినందున ఆరాజువలన 'మల్లంపల్లి' అగ్రహారమును పొందెను. ఆగ్రామమున నివసించిన వీరికి 'మల్లంపల్లి' వారని యింటిపేరు కలిగినది. వీరిది హరితస గోత్రము. వీరు ఆంధ్రులు.

3. నీలకంఠ శివాచార్యులు:- తండ్రి విశ్వేశ్వరారాధ్యులు. తల్లి గౌరీదేవీ. భారద్వాజస గోత్రము. హైదరాబాదులోని "కరీంనగరు" జిల్లాలోని కాళేశ్వరము వీరికాపురము. ఈయనకు: 1 సోమేశ్వర 2 అఘోరనాధ 3 కాళేశ్వర 4 శ్రీగిరీశ్వర అను నలుగురు కుమారులు గలరు.

ఈ నీలకంఠాచార్యులవారు ప్రస్థానత్రయ భాష్యములను రచించినారు. ఈతనికి "బోధాయన" మహర్షి ఉపనయనము చేసినట్లు నీలకంఠ విజయములో గలదు. ఈతడు ఆంధ్రుడు.

4. విశ్వారాధ్యులు:- తండ్రి సోమేశ్వరుడు. తల్లి భవాని. వీరిది కాశ్యపస గోత్రము. నైజాములోని 'పాలకుర్తి' యను గ్రామము వీరి నివాసము. ఇంటిపేరు ఇవటూరివారు. వీరు ఆంధ్రులు. ఈయన క్రీ. శ. 12 వ శతాబ్దము వాడని అందురు. విచారించవలెను.

5. వేమనారాధ్యులు:- వీరింటిపేరు ములుగువారు. కౌండిన్యస గోత్రము. తండ్రి మల్లికార్జునుడు. తల్లిపేరు తెలియదు. వీరిది నైజాములోని ములుగు గ్రామసమీపమున గల 'బెలిదేవి' యనెడి గ్రామము. వీరును 12 వ శతాబ్దము వారు అని చెప్పబడినది.

6. శ్రీపతిపండితులు:- శ్రీశైలనివాసి. తండ్రి మల్లికార్జునుడు. తల్లి భ్రమరాంబ. ఈతడనంత భూపాలు డనెడి రాజునకు గురువు. ఈ శ్రీపతిపండితులు బెజవాడ యందే నివసించిరి. ఈతడు ఆంధ్రుడు. 11 వ శతాబ్దమువాడు.

7. శివలెంక కుంచెన పండితులు:- వీరు కాళహస్తి నివాసులు. వీరిది సాంఖ్యాయనస గోత్రము. ఈయన తాతగారు 'సోమశంభుడు'.