పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"తా|| ఆంధ్రుడుగా పుట్టుట, ఆంధ్రభాష మాతృభాషగలవాడుగా నుండుట, వైదిక ధర్మావలంబి యగుట అందునను యజుశ్శాఖాధ్యాయి యగుట అల్పతపస్సు గలవానికి లభ్యము కానేరదు. అనగా పూర్వజన్మమందు గొప్ప తపస్సు చేసినవానికే ఆంధ్రభాషను మాట్లాడు ఆంధ్రుడుగా పుట్టు భాగ్య మబ్బునని తాత్పర్యము."

అని అప్పయ్యదీక్షితులవారు చెప్పియున్నారు. వీరు ఆంధ్రులని వేఱుగ చెప్పవలసిన పని లేదు. (కొందరు వీరు ద్రవిడశాఖకు చెందినవారని అనుచున్నారు. అటులైనను వీరు "ఆంధ్రదేశము"న స్థిరనివాసము లేర్పరచుకొని (ద్రవిడభాషను మఱచి) ఆంధ్రమునే మాతృభాషగా చేసికొని ఆంధ్రదేశమున నివసించిన ద్రవిడులని చెప్పుట సమంజసము. ఎటులైనను వారాంధ్రులనియే చెప్పుట న్యాయము.) ఇంకను అనేకులు మహామహులు ఆంధ్రులలో అన్ని శాఖలలోను గలరు.

శైవమత వ్యాపకులు

ఆంధ్రదేశములో జైనమతవ్యాప్తి, నడంచిన శైవమతస్థు లెందరో కలరు. వారిని నిచట స్మరించుచుంటిమి. వీరందరును ఆంధ్రులు.

1. శ్రీ రేవణారాధ్యులు :- వీరు సోమేశ్వరలింగానుగ్రహంబున జన్మించిరి. వీరిది ఆత్రేయస గోత్రము. శ్రీ శైలమునకు ఉత్తరముగానున్న బళ్ళారి జిల్లాలోని కొలనుపాక గ్రామనివాసులు. (కొలనుపాక గ్రామము నైజాములోకూడ నొకటి గలదు. ఇదికూడ కావచ్చునని కొంద రనుచున్నారు. కాని ఆ గ్రామము శ్రీశైలమునకు పశ్చిమోత్తరముగా నుండును. కాని సరిగా ఉత్తరము కానేరదు.) శ్రీశైలము కర్నూలు జిల్లాలోనిది. కర్నూలుకు ఉత్తరముగా బళ్ళారి కలదు. శ్రీశైలమునకు బళ్ళారి సమీపములో నున్నందున హద్దులను చెప్పునపుడు సమీపములోనున్న దానిని చెప్పుటయే ఆచారమును న్యాయమునుకూడ నైయున్నది. (బుద్ధిమంతులు విచారించి నిర్ణయించగల రని దీని నింతటితో విడుచుచుంటిని.)