సింహము నెక్కువగా ప్రేమించెడి జాతి. వీరి మత సంబంధమైన దేవతలబొమ్మలలో సింహముపై నెక్కియుండిన స్త్రీదేవత గలదు. ఆమెకు "సింహస్థా" యనెడి నామము గలదు.
కాత్యాయనీదేవి రాక్షస సంహారమునకై యుద్ధమునకు వెడలునపుడు సింహవాహనముమీద నెక్కి వెళ్ళియున్నటుల దేవీభాగవతమున వర్ణితమైనది. ఆంధ్రదేశమున అనేక దేవాలయముల మీదను, గృహములముందు ప్రహరీగోడలోని సింహద్వారముల కిరుప్రక్కలను సింహవిగ్రహములు కాననగును. ఆంధ్రజాతి సింహమువంటి బల, పరాక్రమ, గాంభీర్య, ఔదార్యములు గల జాతి. కనుకనే ఆజాతికి సింహము ప్రీతిపాత్రము, స్తుతిపాత్రము నైనది.
1941 సంవత్సరము మార్చి నెల "గోష్ఠి" పత్రిక 129 పుటయం దిట్లు వ్రాయబడియున్నది.
"అమరావతి శిల్పకాలము లగాయతు ఇటీవలి శతశిల్పియొక్క సింహచిత్రములవఱకు ఆంధ్రజాతికి సింహముగుర్తే ఆదర్శప్రాయముగా నుండియున్నది. అంతర్వేది, మంగళగిరి, హంపివిజయనగరము, సింహాచలము మొదలుగా "నరసింహము" అనెడి దేవత ఆంధ్రుల కుపాస్య మూర్తి. దీనిని బట్టియే 'ఆంధ్రుడు' మానవులలో 'సింహము' వలె బ్రవర్తింప నిచ్ఛయించుచు ఎల్లప్పుడు నుద్రేకపూరితుడై, కార్యశూరుడై యుండును.
"సింహాసనాధిపత్యము" సింహముమీద కూర్చుండి ఆధిపత్యము వహించుట (అనగా ఉత్తమాసన మలంకరించుట అని అర్థము) ప్రతి ఆంధ్రుని మనోరథమై యున్నది. ఆంధ్రులలో 'నరసింహము' అను పేరుగల వార లనేకులు గలరు.
"నెమిలి బర్మాజాతికి చిహ్నము. బెంగాలు, అయోధ్య, జౌస్ ప్రజలకు 'మత్స్యము' చిహ్నము. తమిళులకు 'చిలుక'. రాజరాజ యను రాజు, గోవు - దూడ చిహ్నమును గలిగి యుండెను. విజయ