పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణాగోదావరీపుణ్యనదులచే పవిత్రమగు చుండిన - ఈ దేశమున నివసించుచుండిన చారుత్వర్ణ్య ప్రజలును, అనులోమ విలోమాది కులములకు చెందిన జనులందరును ఆంధ్రులని వ్యవహరింపబడుచుండిరి. బ్రహ్మావర్తమునందు పుట్టి భారతవర్ష మందంతటను వ్యాపించిన ఆర్యులు వారు వారు నివసించెడి రాష్ట్రముల పేర్లతో పిలువబడిరని మనకు స్పష్టముగా తెలియుచున్నది. ఆ రాష్ట్రములు వాటిని పరిపాలించిన రాజనామమున పిలువబడినవి. ఆంధ్ర దేశమున నివసించెడి ఆర్యప్రజలకు ఆంధ్రులనెడి పేరు మధ్య వచ్చినది గాని ప్రథమమునుండి వచ్చినది కాదు. ఇటులనే ద్రవిడ, కర్ణాట, కేరళ, మరాట, గుజరాతు, సింధు మొదలుగాగల రాష్త్రములందు నివసించిన వైదికార్యులు రాష్త్రనామములచే ద్రవిడులనియు, కర్ణాటకులనియు, కేరళులనియు, గుజరాతీయులనియు, సింధీయులనియు లేక సైంధవులనియు దేశనామములచేతనే ఈ నాటివఱకును పిలువబడుచుండిరి. వీరందరును ఆర్యసంతానమేగాని ఆర్యేతరులు కారు. వీరి ప్రక్కనే బాహ్యకులముల వారును నివసించి ఆయా రాష్ట్ర నామములనే కలిగియున్నారు.

రాష్ట్రనామములచే పిలువబడినంతమాత్రమున వారు ఆర్యులకంటె వేఱుజాతివారని యెంచరాదు. ఆర్యజాతియొక్కటే శాఖోపశాఖలై ప్రపంచమంతట వ్యాపించియుండిరని తెలియవలెను. ఆర్యులు నాలుగు కులములు, ఆకులముల, సాంకర్యమున జనించిన అనులోమ విలోమ కులములవారు (Mixed castes), ఆర్యధర్మముల వదలి స్వేచ్ఛా చారులై తమకు తోచినవిధమున ధర్మనిర్ణయములు చేసికొని సంచరించెడి దస్యు, మ్లేచ్ఛ, అనార్యాదేశబ్దములచే పిలువబడుచుండి వేద బాహ్యత నొందినశాఖలు క్షత్రియాది దస్యుజాతులుగను, అందంతరములైన ఇంకననేకశాఖలుగాను ఏర్పడిరి. అందు దస్యులుగా పరిగణింపబడిన వారలు ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర ఆసియాల నాక్రమించి యుండిరి.