పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వివిధ కులములవారును నివసించియుండిరి. రాజును ప్రజలును వేదధర్మముల నాచరించెడి వైదిక సాంప్రదాయములకు చెందినవారైయుండిరి.

ప్రాచ్యక రాజ్యప్రభువగు 'బలి' మహారాజునకు ఆఱుగురు కుమారులు గలరు. వారు: 1. అంగరాజు 2. వంగరాజు 3. కళింగరాజు 4. సుంహ్మరాజు 5. పుండ్రరాజు 6. ఆంధ్రరాజు అనెడి పేరులు గలవా రైయుండిరి. తండ్రి అనంతరము వారాగ్గురును తమ ప్రాచ్యక రాజ్యమును ఆఱు భాగములుగా విభజించుకొని ఎవరి వంతునకు వచ్చిన రాజ్యభాగమునకు వారు తమతమ పేరులు పెట్టి రాజ్యము చేసియుండిరి.

ఈ చరిత్రను భాగవత పురాణ మిట్లు చెప్పియున్నది:-

                   శ్రీమద్భాగవతే నవమస్కంధే 3 అధ్యాయే 5, 6 శ్లోకాః
             శ్లో|| అంగ వంగ కళింగాద్యా:సుంహ్మ పుండ్రాంధ్ర సంజ్ఞి తా:
                   జజ్ఞిరే దీర్ఘతమసో బలే: క్షేత్రే మహీక్షిత:||
             శ్లో|| "చక్రుస్స్వనామ్నా విషయాన్ షడిమాన్ ప్రాచ్యకాంశ్చతే||"

తా|| "బలి యను మహారాజునకు దీర్ఘతముడను ఋషియనుగ్రహమున అంగ, వంగ, కళింగ, సుంహ్మ, పుండ్ర, ఆంధ్రయను పేరులుగల ఆర్గురు కుమారులు గలిగిరి. వారు తూర్పుదేశమునకు రాజులై ఆరుదేశభాగములకు తమ నామములనే పేరులుగానుంచి యేలిరి."

పై శ్లోకములకు పూర్వాపర సందర్భములను చేర్చి శ్రీ బమ్మెర పోతనామాత్యు డిట్లు తెనిగించి యున్నాడు:- "తితిక్షునకు రుశద్రథుండు, రుశద్రథునకు హేముండు, హేమునకు సుతవుండును, సుతవునకు బలియు బుట్టిరి; ఆ బలివలన అంగ, వ,గ, కళింగ, సుంహ్మ, పుండ్రాంధ్రు లను పేరులుగల వారార్వురు కుమారులు పుట్టిరి. వారలు తూర్పు దేశంబులకు (ప్రాచ్యక దేశభాగములు) రాజులై దేశంబులకు తమతమ నామధేయంబు లిడి యేలిరి."

(శ్రీ మద్భాగవత నవమస్కంధము 685 వచనము చూడుడు)