పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లర్పించెడివారు. యవనస్త్రీలు చాల సుందరులును వీర నారీమణులు నైయుండిరి. ఆర్య రాజులవద్ద వీరు అంగరక్షకులుగాను చామరగ్రాహిణులు గాను ఉండెడివారు.

యవనులకు జ్యోతిశ్శాస్త్రమందు ఎక్కువప్రీతి. వారిలో చాలమంది జ్యోతిశ్శాస్త్రప్రవీణు లుండెడివారని భారతము చెప్పుచున్నది. యవన సిద్ధాంత మను జ్యోతిశ్శాస్త్రమును రచించిన 'యవనఋషి' యవనరాష్ట్రములో నివసించెడి మ్లేచ్ఛ యవనబ్రాహ్మణుడు. యవనులు వైదికధర్మముల వదలి మ్లేచ్ఛులైనను వారు తమలో పరంపరగ వచ్చెడి నాలుగువర్ణములను గలిగియుండి ఆయా వర్ణనామములతోడనే గుర్తింపబడుచుండెడివారు. కల్హణ పండితుని రాజతరంగిణి గ్రంథమునందు యవనదేశమున బుట్టిన లోష్టకు డనెడి పేరుగల యొక యవనబ్రాహ్మణుడు కాశ్మీరమున కాశ్మీర రాజుల జాబితాలో 130 వ వాడగు కలశుడనెడి రాజువద్ద క్రీ. శ. 1078-88 సంవత్సరములలో సలహాదారుగా నుండినట్లును ఆతడు జ్యోతిశ్శాస్త్ర వేత్తయైనట్లును చెప్పబడినది. శ్రీములుగు పాపయారాధ్యకృతాంధ్ర దేవీభాగవతము పంచమస్కంధము 532 పుటలో 'సమాధి' యనెడి పేరుగల కిరాత శాఖకుచెందిన యొక వైశ్యునికథ చెప్పబడినది. ఇది రామాయణ చరిత్రకు పిమ్మటికాలమున జరిగినది. ఈవిధముగా శక, యవన, హూణ కిరాతాది క్షత్రియశాఖలవారు మ్లేచ్ఛులైనను వారితోపాటు ఆయాదేశములయందుండిన బ్రాహ్మణ, వైశ్య, శూద్రాదులు గూడ వైదికధర్మముల విడిచినను ఆయాదేశములందు కులవిభాగములతోడనే గుర్తింపబడుచుండెడివారు.

క్రీస్తుశకము పండ్రెండవ శతాబ్దములో పశ్చిమోత్తరభారతమున గల యవనాది క్షత్రియశాఖలవారు మహమ్మదీయులుగా చేయబడినందున ఆశాఖలపేర్లు విస్మరింపబడినవి.