పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సృజించెను. పిమ్మట స్వాయంభువప్రజాపతి భూమిమీద మానవసృష్టిని జేయబూని భారతవర్షమునగల సరస్వతీ, దృషద్వతీనదుల మథ్యస్థమైన భూమియందు ప్రథమమున నివసించి 'శతరూప' యను భార్యతో కలిసి ప్రియవ్రత, ఉత్తానపాదులనెడి యిద్దరు కుమారులను, ఆకూతి, దేవహూతి, ప్రసూతు లనెడి ముగ్గురు కుమార్తెలను కనెను. అతడు ప్రథమమున నివసించిన భూమి "బ్రహ్మావర్త" మని పిలువబడుచున్నది.

బ్రహ్మా వర్తదేశము

మానవజాతి మొదట భారతదేశముననే యుత్పత్తిని బొందినది. ఇప్పుడు భారతదేశమునగల యమునానదికి పశ్చిమమున 'సరస్వతీ' నదియు, దానికి పశ్చిమమున 'దృషద్వతీ' యనెడి దాని యుపనదియు నుండెడివి. ఈ సరస్వతీ, దృషద్వతీ నదులమధ్యగల ప్రదేశము 'బ్రహ్మావర్త'మని అనాదికాలమునుండియు పిలువబడుచుండెడిది. 'బ్రహ్మావర్త' మనగా బ్రహ్మయను పేరుగల స్వాయంభువ ప్రజాపతి మానవజాతిని భూమిమీద నిలుపుటకు ఆదికాలమున స్థూలదేహధారియై నివసించిన స్థలము.

ప్రతిసృష్టియందును ఆదిమానవుడైన 'స్వాయంభువ' ప్రజాపతి స్థూలదేహధారియై మానవసృష్టినిమిత్త మెచ్చట ఆవర్తమును బొందుచు నివసించుచుండునో అట్టిదేశము "బ్రహ్మావర్తమని" అనాదికాలమునుండియు దేవతలచే పిలువబడుచుండినది. ఋగ్వేదమున వినబడిన "యోనిం దేవకృతమ్" (ఋగ్వే 3-33-4) దేవతలచే చేయబడిన మానవజాతి జన్మస్థానము అనువాక్యమును మనువు తన మనుస్మృతి యందు "తం దేవనిర్మితం దేశం" (అనగా దేవతలచే ఏర్పాటుచేయబడిన ఆప్రదేశము) అనివివరించి దాని హద్దులను కూడ ఇచ్చియున్నాడు.. (మను 2-17) తూర్పు - సరస్వతీనది, దక్షిణము సరస్వతీ దృషద్వతీనదుల సంగమస్థలము, పడమర దృషద్వతీనది, ఉత్తరము హిమాలయపర్వతములలో సరస్వతీ, దృషద్వతీనదుల జన్మస్థలముల వఱకు.