పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొని ఈగ్రంథమును చదివిన "ఆంధ్రుల పుట్టుపూర్వోత్తరము" లేవియో వివరముగా సృష్ట్యాదినుండియు తెలియగలవు.

"చరిత్ర" శాస్త్రము (Science) కాదు.

చరిత్ర యనున దొక శాస్త్రము (Science) కాదు. అది యొక కళ (Art). నియమితమైన కొన్ని సూత్రములచే బద్ధమై పఠనపాఠనములచే అధ్యయనము చేయవలసినదై యుండునది "శాస్త్రము." ఇతరులు చేయుచుండిన పనులను చూచి వానిననుకరించి చేయుచు నేర్వదగిన దానికి "కళ" యని పేరు. కాలప్రభావముచే సంభవించుచు ప్రత్యక్షమగుచుండిన విషయములను, చూచినది చూచినట్టు గ్రంథస్థము చేయదగిన "కళకు" "చరిత్ర" యని పేరు. ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్ద ప్రమాణములచే నిరూపింపబడునట్టిది "శాస్త్రము." జరుగుచుండిన విషయములను చూచి తెలిసికొనదగినది "కళ". "చరిత్ర" కళ యనిపించుకొనును గాని "శాస్త్రము" కానేరదు. అందువలన భారతీయుల షట్ఛాస్త్రములలో చరిత్రకు స్థాన మిచ్చుట కవకాశము లేకపోయినది. అది కళలలో చేర్చబడినది. "కళాహ్యనంతా:" అను వచనమునుబట్టి అది యనంతమగు కళలలో నొకటిగా పరిగణింపబడినది.

భారతీయ వాజ్మయమున చరిత్రకు స్థానము లేదనుట పొరబాటు. లోకములో జరిగిన విషయములను చూచినవాటిని చూచినట్లు వివరించుట యనెడి అల్పవిషయ మొక గొప్పశాస్త్రముగా పరిగణింపబడుట అజ్ఞలక్షణము. భారతీయుల పురాణేతిహాసము లన్నియు వివిధకాలములలో జరిగిన చరిత్రలనే చెప్పుచున్నవి. జరిగిన చరిత్రను జరిగినట్లు, చూచినదానిని చూచినట్లు, తాను వినినదానిని వినినట్లు, తాను పూర్వ చరిత్రవలన తెలిసికొనినదానిని తెలిసికొనినట్లు లిఖించుటకు తన ఊహాపోహలతో నిమిత్తము లేదు. లోకమున సంభవించు సంభవము లొక నిర్ణీత పద్ధతి ననుసరించి కాని, కొన్ని సూత్రములకు బద్ధమై కాని జరుగవు. అందు చరిత్రకారుని కెట్టి సంబంధము లేదు. చరిత్రకారుని