పుట:ఆంధ్రులచరిత్ర-సంస్కృతి.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
6

ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి

సక్రమంగా దాన్ని వ్రాయడానికి ఏనాడును ప్రయత్నించలేదు. ఇక్కడ మనం ఒక ముఖ్యవిషయాన్ని గమనించవలసి ఉన్నది. నేటికికూడా మనకు నిర్దుష్టము, నిష్పాక్షికము, సమగ్రము అయిన చరిత్ర లభించలేదనే చెప్పాలి. అటువంటి చరిత్ర రావాలంటే, మనవారి కృషి ఇంకా తీవ్రతరం కావాలి. దేశ చరిత్రను నిరసించి మాటాడే విమర్శకులు లేకపోలేదు. రాజుల జైత్రయాత్రలు, వారు సాధించిన విజయాలు, వానివల్ల జరిగిన రక్తపాతాలు, కుట్రలు, కుతంత్రాలు, దారుణ మారణహోమాలు తప్ప దేశ చరిత్రలో ఏమున్నది? అని వారి యీసడింపు. కాని, ఈ విమర్శలు ఆ పాత రమణీయాలు, అవిచారమూలకాలు అని చెప్పడానికి నేను వెనుకాడను. ప్రయోజనాన్నిబట్టి రచనా విధానం మారుతుంది. వారు వ్రాసినది దేశ చరిత్రగాని, సాంస్కృతిక చరిత్రకాదు. ఆనాడు దేశంయొక్క బాగోగులన్నీ రాజులమీద ఆధారపడి ఉండేవి. ఈనాటి ప్రజలలో ఉన్న రాజకీయ చైతన్యం ఆనాటి ప్రజలలోలేదు. రాజు రాజ్యానికి మూలస్తంభం. అతని సైనికబలంమీద, యుద్ధతంత్ర నైపుణ్యంమీద, చతురపాయ చతురతమీద దేశాభ్యుదయం ఆధారపడి ఉండేది. ఇంతెందుకు, రాజుంటేనే సైనికులు యుద్ధం చేసేవారు. అతడు మరణిస్తే అతిబల మహాబలులైన సేనాధిపతులుకూడా, నిరుత్సాహంతో నిరుగారిపోయేవారు. అటువంటి పరిస్థితిలో చరిత్రకారుడు రాజునిగురించి కాకపోతే మరెవరిని గురించి వ్రాస్తాడు? ఇంతకు, దేశమంతటికి సంబంధించిన ముఖ్యపరిణామాల్ని వివరించడం చరిత్రకారుని ధ్యేయం. ఆ ప్రయోజనం సాధింపబడిందా? లేదా? అన్నదే మనం పరిశీలించవలసిన విషయం. అతనిధ్యేయం కానిదాన్ని, అతని ప్రణాళికలో లేనిదాన్ని అతడు సాధించలేదని నిరసించడం అసమంజసం. దేశచరిత్ర రాజనాయకమైనది. సామూహికంగావచ్చే పెద్దమార్పులను మాత్రమే అది వివరిస్తుంది. రాజ్యాంగవిధానాన్ని స్థూలంగా నిరూపిస్తుంది. దైనందిన ప్రజాజీవితాన్ని వ్యక్తీకరించదు.

మన తాతముత్తాతలు ఎలా బ్రతికేవారు? వారి మత విశ్వాసాలు, ఆచారవ్యవహారాలు, వినోద కార్యక్రమాలు ఎటువంటివి? వారు ఎటువంటి ఉడుపులంటే మోజు పడేవారు? స్త్రీలు నోచే నోములు, ధరించే ఆభరణాలు, పాడే పాటలు, ఆడే ఆటలు ఎటువంటివి? శిల్ప చిత్రలేఖన నాట్యాది కళలలో పూర్వులు సాధించిన ప్రగతి ఎటువంటిది? అందు వారు చేసిన కృషి ప్రశంసనీయమేనా? - ఇటువంటి ప్రశ్నలకి సమాధానం కావాలంటే మనం సాంస్కృతిక చరిత్రవంక మన దృష్టిని కేంద్రీకరించవలసి ఉంటుంది. ఒక జాతికాని, ఒక సంఘంగాని, భిన్న కాలాలలో, భిన్న పరిస్థితులలో తన జీవితప్రమాణాన్ని, విధానాన్ని అభివృద్ధి చేసుకోడానికి, తన సుఖ సంతోషాల్ని ఇనుమడింపజేసుకోవడానికి, తన చుట్టూవున్న ప్రకృతి తత్వాన్ని అవగహన చెసుకోవడానికి, భౌతికంగా మానసికంగా నిరంతర కృషి చేస్తుంది. ఆ కృషి ఫలితమే, ఆ జాతి లేక సంఘంయొక్క సంస్కృతి అని చెప్పవచ్చును.