పుట:ఆంధ్రులచరిత్ర-సంస్కృతి.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి

ఆంధ్రదేశ చరిత్రలో, ఈ సంవత్సరం (1975), స్వర్ణాక్షరాలతో వ్రాయదగినది. ఆంధ్ర రాష్ట్రం అవతరించిన తరువాత ఇన్నాళ్లకు మనం ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుకుంటున్నాం. ఆంధ్రరాష్ట్రంలోనే కాకుండా, ఆంధ్రేతర రాష్ట్రాలలోకూడా ఉన్నటువంటి ఆంధ్రులందరూ, ఒకచోట సమావేశమయి, వివిధాంశాల్ని గురించి చర్చించుకోవడానికి తగిన అవకాశం ఇన్నాళ్లకు లభించింది. వివిధ దేశాలనుండి వచ్చిన ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొనడం హర్షదాయకమైన విషయం. అంతర్విశ్వవిద్యాలయ సాంస్కృతికోత్సవం కూడా ఇప్పుడే నిర్వహింపబడడం, తెలుగువారి వివేచనాశక్తికి, ఔచితపరిపోషణ సామర్థ్యానికి ప్రబల నిదర్శనం. ఈ శుభసమయంలో మనం మన చరిత్రనీ, పరంపరాగతమైన మన సంస్కృతినీ వెలుగులోనికి తెచ్చిన విద్వాంసుల్ని స్మరించడం సమంజసమే కాదు, అత్యావశ్యకం కూడా. ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి అనే విషయాలమీద పూర్వం కృషిచేసిన మహనీయులు అనేకులు ఉన్నారు. ఇప్పుడు మన విశ్వకళాపరిషత్తులో వివిధశాఖలకు చెందిన విద్వాంసు లనేకులు, ఈ అంశాలపై ప్రశంసనీయమైన కృషిచేస్తున్నారు. అన్ని రంగాలలోవలెనే, ఈ చారిత్రక సాంస్కృతిక రంగంలోను, ఆంధ్ర విశ్వకళాపరిషదధ్యాపకులు బహుముఖాల పరిశోధనలుచేసి అత్యపూర్వములైన సత్ఫలితాలను సాధించి ఉన్నారు. వాటిని గుర్తుచేసుకోవలసిన ఆవశ్యకత మనకెంతైనా ఉన్నది. ఈలాగున ఒకమారు సింహావలోకనం చేసుకున్నందువల్ల, చారిత్రక సాంస్కృతిక రంగంలో ఇప్పటికి జరిగిన పరిశోధన ఎంతో, జరుపవలసిన పరిశోధన ఎంతో, మనకు స్పష్టంగా తెలుస్తుంది. విద్యాపురోగతికి ఇటువంటి సమీక్ష అత్యావశ్యకం.

ఈ పరిశోధనల్ని వివరించడానికి పూర్వం దేశ చరిత్రకి, సాంస్కృతిక చరిత్రకి గల సంబంధభేదాల్ని స్పష్టీకరించవలసి ఉన్నది. నేటి విద్యావిధానంవల్ల మనకు సంక్రమించిన సత్ఫలితాల్లో చరిత్రాధ్యయనం ఒకటి. మన జాతికి మహోజ్జ్వలమైన చరిత్రఉన్నది. కాని దాని పరిరక్షణ విషయంలో మన పూర్వులు శ్రద్దచూపెట్టలేదన్నమాట వాస్తవం. దాన్ని కాదన్నందువల్ల మనకుగాని, వారికిగాని వచ్చే గౌరవలాభాలు ఏమీలేవు. అక్కడక్కడ ఛిన్నాభిన్నంగా, అస్తవ్యస్తంగా పడిఉన్న శాసనాలు, కైఫీయతులు, రాజవంశావళులు మొదలైన ఆధారాలను క్రోడీకరించి క్రమపద్దతిలో సమీక్షించి మనదేశ చరిత్ర వ్రాసిన కీర్తి ఆధునికులకే దక్కింది. ఈలాగు అనడంవల్ల ఈ నగ్నసత్యాన్ని అంగీకరించినందువల్ల మన పూర్వుల ఖ్యాతికి యద్విథమైన కళంకము రాదు. వారు చరిత్ర ప్రాధాన్యాన్ని గుర్తించలేదు. అందుకే

5