పుట:ఆంధ్రులచరిత్ర-సంస్కృతి.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
18

ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి

ఆంధ్రదేశ చరిత్రకారులు:

ఆంధ్రదేశచరిత్ర రచించిన మహనీయుల్లో ప్రప్రథమంగా పేర్కొనవలసినవారు చరిత్రచతురానన బిరుదాంచితులు చిలుకూరి వీరభద్రరావుగారు. ఆంధ్రదేశచరిత్రను మూడు సంపుటాలలో వీరు ప్రకటించారు. బహుముఖప్రధురంధరులు శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారు ఆంధ్రుల చరిత్ర విషయంలో చేసిన కృషి అపారమైంది. వీరు రచించిన గ్రంథాలలో ప్రముఖమైంది "రెడ్డిరాజ్యముల చరిత్ర" (History of Reddy Kingdoms). ఆంధ్రదేశచరిత్ర సంగ్రహం, అమరావతీస్తూపం మొదలయినవి వీరి యితర రచనలు. తెలుగుభాషాసమితివారు ప్రకటించిన తెలుగు విజ్ఞాన సర్వస్వ సంపుటాలలో మూడవదానికి (తెలుగు సంస్కృతి) ముఖ్య సంపాదకులు వీరు. వీరు ప్రకటించిన శాసనాలు, వ్యాసాలు అసంఖ్యాకం. నేలటూరి వేంకటరమణయ్యగారు, నీలకంఠశాస్త్రిగారు, భావరాజు వేంకట కృష్ణారావుగారు, మారేమండ రామారావుగారు మొదలైన విద్వాంసులు అనేకులు ఆంధ్రదేశచరిత్రకు సంబంధించిన వివిధ విషయాలమీద కృషిచేసి, చరిత్ర నిర్మాణానికి సర్వవిధాలా తోడ్పడ్డారు.

దేశచరిత్రరచనలో చూపిన ఉత్సాహం మనవారు సాంస్కృతికచరిత్రరచనలో చూపినట్లు కనబడదు. ఆంధ్రుల సాంఘికచరిత్ర వ్రాసినవారిలో ప్రథములు శ్రీ సురవరము ప్రతాపరెడ్డిగారు. దాన్ని వ్రాయడానికి వారు చేసిన కృషి అత్యపూర్వమైనది. దానికి కేంద్ర సాహిత్య అకాడమీవారి బహుమతికూడా లభించింది. ఆచార్య ఖండవల్లి లక్ష్మిరంజనముగారు, ఖండవల్లి బాలేందుశేఖరంగారు కలసి "ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి" అనే పేరున ఒక గ్రంథం వ్రాశారు. ఆంధ్ర విశ్వకళాపరిషధుపాధ్యక్షులు రాజా శ్రీ మేకా రంగయ్యప్పారావుగారు ఆంధ్ర సంస్కృతిపై ఒక గ్రంథం వ్రాశారు. ఆంధ్రుల సంస్కృతికి సంబంధించిన ముఖ్య విషయాలన్నీ ఇందులో వివరింపబడ్డాయి. సాంస్కృతిక చరిత్రను వివరించే గ్రంథాలు ఈ మూడే. అప్పుడప్పుడు కొందరు వ్రాసాలు ప్రకటిస్తున్నారు.

ఇక ఆంధ్రవిశ్వకళాపరిషదధ్యాపకులు, పరిశోధకులు, చరిత్ర సంస్కృతుల గురించి చేసిన కృషిని పరిశీలిద్దాం.