పుట:ఆంధ్రులచరిత్ర-సంస్కృతి.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి

17

రాఘవుడు రాజ్యాన్నే విడిచిపెట్టాడు. ఆనాటి యక్షగాన వాఙ్మయమంతా వారి నాట్య సంగీత కళాభిరుచికి నిదర్శనం.

సారస్వతం:

పూర్వ చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుడి కాలంలో ఆంధ్ర మహాభారతం అవతరించింది. మన వాఙ్మయంలో ఇప్పటికి లభించిన ప్రథమ మహాగ్రంథం అదే. కాని, నన్నయ భారత కవిత్వంవంటి రచన హఠాత్సంభవం కాదు. కాలేదు. అంతకుముందు కొంత వాఙ్మయం ఉండి ఉంటుంది. ఇది ఊహ మాత్రమే. తరువాత మన దేశాన్ని ఏలిన రాజులందరూ సారస్వతాన్ని పోషించారు. నిజానికి ఆంధ్ర కవి అనుభవించిన మహదైశ్వర్యం ఆనితర సాధారణం.

ఆటలు - వేడుకలు- వినోదాలు:

ఆధునికకాలంలో పూర్వపు క్రీడలు, వేడుకలు మొదలైనవాటిమీద ఆదరణ తగ్గిపోయింది. తత్కారణంగా మన సారస్వతంలో పేర్కొనబడ్డ క్రీడావిశేషాలు ఎటువంటివో, వాటిని ఏ ప్రకారంగా ఆడేవారో కూడా మనకు తెలియదు. వృత్తికారులు, నిఘంటుకారులు వాటి అర్థం చెప్పకుండా, కేవలం బాల్యక్రీడా విశేషమనో, క్రీడావిశేషమనో చెప్పి ఊరుకుంటారు. తెలిసినంతవరకు ఇక్కడ వివరించబడుతున్నాయి. అయ్యలరాజు నారాయణామాత్యుడు తన హంసవింశతిలో అనేక క్రీడల్ని పేర్కొన్నాడు. కాని అవి ఆడేవిధానం తెలియడం లేదు. అచ్చసగండ్ల కేవలం బాలిక లాడుకునే ఆట. కోతికొమ్మంచులు బాలురుమాత్రం ఆడదగినది. కుందికట్టు, కంబాలాట, పుట్టచెండ్లు, దాగిలిమూతలు మొదలైనవి బాలబాలికలు కలిసి ఆడదగినవి. ఈ ఆటలలో చాలవాటికి పాటలు కూడా ఉంటాయి. పాటపాడుతూ, ఆట ఆడ్డం ఒక హాయి. ఈ ఆటలకి ఒక్కొక్క మండలంలో ఒక్కొక్కపేరు ఉండడం కూడా కద్దు.

వీటితోపాటు జాతీయములైన చెడుగుడు (కబాడి), బొంగరాలాట, గాలిపటాల ఎగురవేత మొదలయినవి కొంచెం పెద్దవాళ్లు ఆడే ఆటలు. సజీవ నిర్జీవ ద్యూతం మన కెప్పుడూ ఉంది. కోడిపోరువల్ల రాజ్యా లంతరించాయి. అలాటిదే పొట్టేళ్ళ పోరాటం. చదరంగం, పాచికలాట, పులిబోను మొదలైనవి తీరుబడిగలవారి ఆతలు.

పూర్వగ్రంథాల్లో మల్లయుద్ధాలు, గజయుద్ధాలు, అశ్వయుద్ధాలు, వృషభయుద్ధాలు మొదలైన వినోదాల్లో యువవీరులు పాల్గొనేవారు. కుంతల సోమేశ్వరుని "అభిలషితార్థ చింతామణి"లో ఇటువంటి క్రీడావిశేషాలు చాల పేర్కొనబడ్డాయి.

ఈ పరిమితవ్యాసంలో మహ్హోజ్జ్వలమైన ఆంధ్ర సంస్కృతిని దిజ్మాత్రంగానైనా చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి "చరిత్ర - సంస్కృతి" అనే విషయం మీద పరిశ్రమ చేసినవార్ని ఒకమారు స్మరిద్దాము.