పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంస్థలు హైదరాబాదులోనూ, హైదరాబాదు చుట్టుపక్కలా నెలకొని ఉన్నాయి. 9వ, 10వ షెడ్యూళ్ళలో చేర్చని ఇతర సంస్థలు గాలికి వదలి వేయబడ్డాయి. శేషాంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రధానంగా వ్యవసాయక రాష్ట్రం. అందువల్ల ఇక్కడ స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో పన్నుల వాటా 6.8 శాతం కాగా, తెలంగాణ రాష్ట్రం పట్టణీకరణ చెందినందువల్ల అక్కడ ఆ వాటా 9.7 శాతం దాకా ఉంది. పరిమితమైన వనరులు మాత్రమే అందు బాటులో ఉన్నందువల్ల నవ్యాంధ్రప్రదేశ్ కు సంబంధించిన సామాజిక, ఆర్థిక రంగాల్లో అన్ని మౌలికసదుపాయాలు కల్పించడం కష్టసాధ్యమైన విషయం. ఇంత పెద్దఎత్తున పెట్టుబడి పెట్టడానికి అవసరమైన పరిహారమేదీ అప్పటి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉండలేదు. అప్పటి కేంద్రప్రభుత్వం అనుసరించిన అహేతుక, అసంబద్ధ రాష్ట్ర విభజన ప్రక్రియ వల్ల శేషాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిగిన నష్టం ఎటువంటిదో ఈ నిర్లక్ష్యం ద్వారా మనం గమనించవచ్చు. నేడు మన ముందున్న సవాళ్లు ఎంత తీవ్రమైనవో దీన్నిబట్టి మనం గ్రహించవచ్చు.

8. ఇంతదాకా వివరించిన విషయాలే కాక, మరెన్నో సమస్యలూ, సవాళ్లూ నవ్యాంధ్రప్రదేశ్ ఎదుట మొహరించి ఉన్నాయి.

దిశానిర్దేశం:

9. ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళిక కోసం నిర్దేశించుకున్న ఆశయాలకు, లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వం చేపడుతున్న కొన్ని ముఖ్య అభివృద్ధి వ్యూహాలను తమ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తున్నాను.

4