పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బయటకూడా ఎన్నో ఆశలు రేకెత్తించాయి. కానీ 2004 తరువాత ప్రభుత్వం ఉదాసీనతతో ఈ బృహత్తర ఉద్యమం నెమ్మదిగా వన్నె తగ్గడం మొదలయింది.

6. ప్రణాళికేతర ఆదాయానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగులు ఆదాయరాష్ట్రంగా ఉండేది. కానీ దురదృష్టవశాత్తూ రాష్ట్ర విభజన వల్ల శేషాంధ్రప్రదేశ్ కు ప్రణాళికేతర రంగంలో రెవిన్యూ లోటు గుదిబండ గా మారింది. రాష్ట్ర ఆర్థికపరిస్థితి మీద రాష్ట్ర విభజన తీవ్ర ప్రభావాన్ని చూపించింది. రాష్ట్ర ఋణాలు, ఉద్యోగులు, పింఛనుదారులు జనాభా ప్రాతిపదికన కేటాయించబడినందువల్ల రాష్ట్ర వ్యయం కూడా ఉమ్మడి రాష్ట్రవ్యయం లోని 58 శాతం కన్నా ఎక్కువగానే ఉండే పరిస్థితి ఏర్పడింది. కానీ రాష్ట్రానికి ప్రధాన ఆదాయపు వనరు అయిన అమ్మకపు పన్ను ద్వారా వచ్చే రాబడి ఉమ్మడి రాష్ట్ర ఆదాయంలో దాదాపు 47 శాతం మాత్రమే ఉండే పరిస్థితి ఏర్పడింది. అలాగే స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషను ఫీజు, మోటారువాహనాల పన్ను మొదలయినవన్నీ 50 శాతం కన్నా తక్కువగా ఉండే పరిస్థితి ఏర్పడింది. శేషాంధ్రప్రదేశ్ వాటాలో ఒక్క ఎక్సెజ్ ద్వారా వచ్చే ఆదాయం మాత్రమే దాదాపుగా 55 శాతం ఉండగలదు. మైనింగ్ ద్వారా వచ్చే నాన్ స్టాక్స్ ఆదాయం ఉమ్మడి రాష్ట్ర ఆదాయంలో 30 శాతం కన్నా తక్కువగానే ఉంటుంది. శేషాంధ్రప్రదేశ్లో మొత్తం మీద పన్నులద్వారానూ, ఇతరత్రా రూపేణా రాగల ఆదాయం ఉమ్మడిరాష్ట్ర ఆదాయంలో 47 శాతానికి దగ్గరగా ఉండగలదని అంచనా వేయడమైంది. కాబట్టి ఒక సక్రమమైన అంచనాతో ప్రణాళికను రూపొందించుకోవడానికి అవసరమైన వనరులు రాష్ట్రానికి లేకుండా పోయాయని చెప్పక తప్పదు.

7. ఆదాయంలోని ఈ అసమానపంపిణీతోపాటు, సామాజిక ఆర్థికరంగాలకు సంబంధించిన కీలక మౌలికసదుపాయాలు కూడా తెలంగాణ రాష్ట్ర పరం కానున్నాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9వ 10వ షెడ్యూళ్లలో పొందుపరచబడిన ఎన్నో