పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సామాజికవర్గపరంగానూ ఉన్న వ్యత్యాసాలను తగ్గించడం, నాణ్యమైన, గుణాత్మకమైన విద్యను అందించడం ఆ పథకం ముఖ్య లక్షణాలు.

98. 2014-15 లో కొత్తగా 48 ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించబడ్డాయి. 11 పాఠశాలలు ప్రాథమికోన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ కాబడ్డాయి. 2,441 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతి ప్రారంభించబడింది. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో బోధిస్తున్న ఉపాధ్యాయులందరికీ ఇన్ సర్వీస్ శిక్షణ ఇవ్వబడింది. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 8 వ తరగతి దాకా చదువుతున్న 35 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికీ 2 జతల చొప్పున యూనిఫాం అందించబడింది. విద్యాపరంగా వెనుకబడ్డ మండలాల్లో సామాజికంగా వెనుకబడ్డ బాలికలకు గుణాత్మకంగా విద్యను అందుబాటులోకి తీసుకురావడం కోసం 345 కస్తూర్బా గాంధీ బాలికావిద్యాలయాలు నెలకొల్పబడ్డాయి. అవి ఎలిమెంటరీ స్థాయి దాకా విద్యనందిస్తున్నాయి.

99. 14 నుంచి 18 మధ్య వయసు గల పిల్లలకు విద్యనందిస్తూ మాధ్యమికవిద్య ఎలిమెంటరీ మరియు ఉన్నతవిద్యారంగాల మధ్య ఒక సేతువుగా పనిచేస్తుంది. కేంద్రప్రభుత్వ ప్రాయోజిత పథకమైన రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్ఎమ్ఎస్ఎ) నాణ్యమైన మాధ్యమిక విద్యను అందుబాటులోకి తీసుకురావడం కోసం కృషి చేస్తున్నది. గుణాత్మక విద్యనందించడం, మౌలికసదుపాయాల కల్పన, సమత్వసాధన ఈ పథకం ముఖ్య ఉద్దేశాలు.

100. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, విద్యార్థుల హాజరు పెంపొందించడం, డ్రాప్ఔట్ రేట్లను తగ్గించడం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో 'బడి పిలుస్తోంది' అనే కార్యక్రమాన్ని గౌరవనీయ ముఖ్యమంత్రివర్యులు 25.7.2014 న అనంతపురం జిల్లాలో ప్రారంభించారు.

33