పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మన దేశాన్ని స్వయంసమృద్ధదేశంగా రూపొందించడంలో మన వ్యవసాయ సమాజం గొప్పపాత్ర పోషించింది. అయితే దురదృష్టవశాత్తు వరుసగా సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలు, ఖర్చుల పెరుగుదల, గిట్టుబాటుధర రాకపోవడం వంటి కారణాల వల్ల రాష్ట్రంలో వ్యవసాయక్షేత్రంలో తీవ్రసంక్షోభం నెలకొని ఉంది. ఈ సంక్షోభం ఏస్థాయికి చేరుతుందంటే పరిస్థితుల ప్రభావానికి తట్టుకోలేక ఎందరో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ విధంగా గూడుకట్టుకున్న నైరాశ్యాన్నీ, సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసం రైతు జనావళికి చేయూతనందించడం కోసం చరిత్రలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా రైతు రుణాలను మాఫీ చేయడం కోసం మేము ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాం. రైతులు వ్యవసాయం కొరకు బ్యాంకుల నుండీ, సహకార సంఘాలనుండీ తీసుకున్న పంట ఋణాలను, బంగారుపై తీసుకున్న ఋణాలతో సహా కుటుంబానికి రూ.1.50 లక్షల వరకు ఋణభారం నుండి ఉపశమనం కలిగించడానికి నిర్ణయించాము. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఈ నిర్ణయం రాష్ట్రం మీద మరింత పెనుభారం మోపనున్నదని మాకు తెలుసు. కానీ రైతులకు ఈ సదుపాయం కలిగించకపోతే భవిష్యత్తులో వ్యవసాయరంగం నిలదొక్కుకోవడం దుస్సాధ్యం. అయితే ఈ పథకం అమలుచేయటంలో రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా, మరియు బ్యాంకులు లేవనెత్తిన ఎన్నో సాంకేతిక అవరోధాలను మేం అధిగమించవలసి ఉంది. అయితే రైతులను ఋణభారం నుంచి విముక్తులను చేయటానికి వనరులు సమకూర్చే దిశగా మే శాయశక్తులా కృషిచేయనున్నాము. వ్యవసాయరంగాన్ని నిలదొక్కుకునే విధంగా, గిట్టుబాటు కలిగించే రంగంగా చేయటంకోసం వివిధ చర్యలు చేపట్టవలసింది. తన పాదయాత్రలో రైతులను కలుసుకున్నప్పుడు వారి కడగండ్లను స్వయంగా చూసిన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబునాయుడుగారు చలించిపోయారు. పలువిధాలైన రైతుసమస్యలను ఎదుర్కోవటానికి బహుముఖమైన వ్యూహమొకటి రూపొందించాలనే భావనకి అప్పుడే అంకురార్పణ జరిగింది.

13