పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఖనిజాలు మొదలగు సహజ వనరుల పరాధీనత, అక్రమమద్యం అమ్మకాలు, అటవీసంపద దోపిడీ, ప్రజాపనులలో ముఖ్యంగా నీటిపారుదల రంగంలో ప్రజాధనం దుర్వినియోగం వంటి అంశాలను సమీక్షించి అవినీతిని ఎదుర్కొని, ప్రభుత్వ ఆస్తులు ఆదాయాలను సంరక్షించాలనే నిర్దిష్ట సంకల్పంతో, ప్రభుత్వం మంత్రివర్గ సంఘాన్ని నియమించింది. ఈ సంఘము ఆర్థిక నిర్వహణ లో పారదర్శకత, నిజాయితీ, సమర్థతను పెంపొందించడానికి తగిన సూచనలు చేస్తుంది.

23. తక్కిన దేశంలోలాగానే మన రాష్ట్రంలో కూడా జనాభాలో యువత శాతం గణనీయంగా ఉంది. మధ్యతరగతి త్వరితంగా అభివృద్ధి చెందుతున్నది. ఈ రెండు వర్గాలకు చెందినవారికి చాలా ఉన్నతమైన ఆకాంక్షలున్నాయి. ఆ ఆకాంక్షలను నెరవేర్చడం కోసం మా ప్రభుత్వం శాయశక్తులా కృషి చేయటానికి సిద్దంగా ఉంది. యువతకు తగిన నైపుణ్యాల కల్పన, సమర్థవంతంగానూ సకాలంలోనూ సేవలు అందించడం, అన్ని గ్రామాలనూ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ద్వారా అనుసంధానించడం, రక్షిత మంచినీటి సరఫరా కోసం వాటర్ గ్రిడ్ ఏర్పాటు, ప్రతి కుటుంబంలోనూ కనీసం ఒకరికి ఉపాధి కల్పించేలా ఉద్యోగ అవకాశాల కల్పన, జీవన ప్రమాణాల మెరుగుదల మీదే మా దృష్టి నిరుద్యోగులకు ఉపాధి కలిగే వరకు నిరుద్యోగ భృతిని అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం. స్థూల రాష్ట్ర సంతోషసూచిక, స్థూలరాష్ట్ర వస్తూత్పత్తి సూచిక కన్నా ముఖ్యమని మేం ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం.

24. బడ్జెట్ రూపకల్పన, వ్యయనిర్వహణలను మెరుగుపరచడంలో భాగంగా రాబోయే సంవత్సరం నుంచి బడ్జెట్లో యథాతథంగా కేటాయింపుల పెరుగుదల ఉండబోదని తెలియజేస్తున్నాను. అందుకు బదులు ఆయా ప్రభుత్వ శాఖలు తాము కేటాయింపు చేయనున్న ప్రతి అంశంలోనూ తాము ప్రతిపాదిస్తున్న వ్యయాన్ని ఎందుకు ప్రతిపాదిస్తున్నారో జీరోస్థాయి నుంచి వివరించి సమర్థించుకోవలసి ఉంటుంది.

11