పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాలంలో మేము ఆర్థిక ఆదాయాన్ని వీలైనంత పెంచడానికీ, రాష్ట్ర ప్రజలు తాము ఖర్చు పెట్టిన సొమ్ముకు మరింత విలువ పొందేవిధంగా వ్యయనిర్వహణ చేయడానికి మేము శాయశక్తులా కృషిచేయనున్నాము. ప్రభుత్వ పథకాలు ఉద్దేశించిన లబ్దిదారులకే చెందడానికీ, ఎటువంటి దుర్వినియోగం కాకుండా చూడడానికీ ఆధార్ నంబరును తప్పనిసరిగా అన్ని పథకాలకూ అనుసంధానం చేయాలని నిర్ణయించడం జరిగింది. భారతప్రభుత్వ బడ్జెట్లో మన రాష్ట్రం కోసం ఉద్దేశించిన కొన్ని కేటాయింపులు ఉన్నాయి. కాని ఇవి చాలినంతగా లేవు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 లో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలకు భారతప్రభుత్వం కట్టుబడి ఉందని భారతప్రభుత్వ ఆర్థికశాఖామాత్యులు తమ బడ్జెట్ ప్రసంగంలో స్పష్టంగా పేర్కొన్నారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. కాబట్టి బడ్జెట్లో చూపించిన కేటాయింపులకు మాత్రమే పరిమితం కాకుండా కేంద్ర ప్రభుత్వం నుండి మరింత అదనపు వనరులను రాబట్టే దిశగా మేం మరింత కృషి చేస్తామని విన్నవించుకుంటున్నాను.

22. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబునాయుడు గారు దాదాపు 3,000 కి.మీ ల తమ పాదయాత్రలో భాగంగా ప్రజాబాహుళ్యాన్ని ప్రత్యక్షంగా సందర్శించి, వారితో మమేకమై వారి సమస్యలను లోతుగా అర్థం చేసుకున్నారు. ఆ అవగాహనపైనే మా పార్టీ మానిఫెస్టో రూపొందింది. ఆ అవగాహన తోనే ఇప్పుడు ప్రభుత్వ పథకాలు రూపుదిద్దుకుంటున్నాయి. పౌరులందరూ సమానావకాశాలు పొందగలిగే పేదరిక రహిత సమాజస్థాపనే మా ధ్యేయం. ఈ సందర్భంగా 'కీర్ హార్డీ' గారి పలుకులను గుర్తుచేస్తున్నాను. "ప్రగతికి సిసలైన గీటురాయి ఏమిటంటే, సంపద కొద్దిమందిచేతుల్లో పోగవడాన్ని సూచించేది కాక, ప్రజలందరి ఉన్నతిని సూచించేది". మేము అవినీతి రహిత పారదర్శక పాలనను అందించడానికి కట్టుబడి ఉన్నాము. భూమి, అటవీ సంపద, గనులు,

10