పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2022-23.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

'సుస్థిర నగరాలు మరియు సంఘాలు’ క్రింద, 100% వార్డులలో ఇంటింటికీ చెత్త సేకరణ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ విధానంలో భాగంగా మునిసిపల్ వ్యర్థాలను తగ్గించడం, రీసైకిల్ చేయడం మరియు తిరిగి ఉ పయోగించడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం 85 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్రాజెక్ట్ ను మంజూరు చేయగా 32 ప్రాజెక్ట్ కు ఇప్పటికే పని చేస్తున్నాయి. లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న 93 పట్టణ స్థానిక సంస్థలలో 93 మురుగునీటి శుద్ధి ప్లాంట్ లను వచ్చే మూడేళ్లలో నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. 2019-20 లో ఉత్పత్తి చేయబడిన మొత్తం ప్రాసెస్ట్ మునిసిపల్ ఘన వ్యర్థ పదార్థాలు 48% ఉండగా 2021-22 లో ఇది 53.62% కి పెరిగింది. 2022-23లో పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖకు 8,796.33 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

పర్యావరణం మరియు అడవులు

“పర్యావరణం మరియు ఆర్థిక వ్యవస్థ నిజంగా ఒకే నాణేనికి రెండు వైపులా ఉన్నాయి.
పర్యావరణాన్ని పరిరక్షించలేకపోతే మనం మనుగడ సాధించలేము. - నోబెల్ గ్రహీత వంగరి మాతై


87. మన రాష్ట్రం సుసంపన్నమైన జీవ వైవిధ్యాన్ని కలిగి ఉంది. దీనిని పెంపొందించు కోవడం మన అందరి బాధ్యత. రాష్ట్రంలో నమోదైన అటవీ ప్రాంతం మన రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 23%. జాతీయ అటవీ విధానం, 1988 కి అనుగుణంగా భౌగోళిక ప్రాంతంలో 33% పచ్చదనాన్ని మెరుగుపరచాలని మరియు పౌరులకు సుస్థిరమైన నివాస యెగ్య స్థలాన్ని సృష్టించాలని మన ప్రభుత్వం భావిస్తోంది. ఈ లక్ష్య సాధనలో, ఈ సంవత్సరంలో, అన్ని ముఖ్య ప్రభుత్వ శాఖలు, అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని, కాంపన్ సైటరీ ఫారెస్ట్రేషన్ ఫండ్ మేనేజ్ మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (CAMPA), మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS), రాష్ట్ర అభివృద్ధి పథకాల మరియు కేంద్ర ప్రాయోజిత పథకాల నుండి నిధులను సమకూర్చడం ద్వారా మరియు 9.39 కోట్ల మొక్కలు నాటడం ద్వారా జగనన్న పచ్చతోరణం క్రింద భారీ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ప్రయత్నం ఫలితంగా, ఇటీవల విడుదల చేసిన భారత దేశ అటవీ రాష్ట్ర నివేదిక 2021 ప్రకారం 647 చ.కి.మీ.ల మేర పచ్చదనాన్ని అదనంగా పెంచగలిగి భారతదేశంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడం గర్వించదగ్గ విషయం.

88. స్మార్ట్, క్లీన్ మరియు హెల్త్ సిటీల కోసం పట్టణ మరియు పట్టణ శివారు ప్రాంతాలలో స్వచ్ఛమైన గాలి లభ్యతగల ప్రదేశాలను అందుబాటులోకి తేవడం మరియు విస్తరించడం ద్వారా వాతావరణ మార్పులను తట్టుకోగల నగరాలను అభివృద్ధి చేయాలని మన ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి 'నగర వనం' పథకం అమలవుతోంది.

24