పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. వలసపాలన బాధిత దేశాలలో విస్తృతమైన అసమానతలను వదిలిపెట్టింది. ఇంతేగాక ఇది సమతుల్యంలేని సంపద పంపిణీకి కారణమయ్యింది. దీనివలన మూడవ ప్రపంచ దేశాలలో కరువు, పేదరికం, అల్పాయుష్షు, విస్తృతమైన పోషకాహార లోపం మరియు నిరక్షరాస్యత వంటి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. మార్షల్ ప్లాన్‌ను అనుసరించి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, పరస్పర సహకారంతో కలిసి పనిచేయడానికి వివిధ దేశాలు తీర్మానించుకున్నప్పటికీ, ఇంకా ఈ సవాళ్ళను అధిగమించలేకపోయాము. పేదరికం మనకు పెద్ద సవాలుగా మిగిలిపోయింది. ఇటువంటి సమస్యలను ఎదుర్కోవటానికి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఒక సమిష్టి ప్రయత్నం 2015 కాలపరిమితితో సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలను (మిలీనియం డెవలప్ మెంట్ గోల్ లను) సాధించే రూపంలో తెరపైకి వచ్చింది. ఈ బహుళ లక్ష్యాలలో సాధించిన వివిధ స్థాయిల పురోగతిని దృష్టిలో ఉంచుకుని, అన్ని దేశాలు "సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను” (సస్టైనబుల్ డెవలప్ మెంట్ గోల్ లను) స్వీకరించే దిశగా ఐక్యరాజ్య సమితి న్యూయార్క్ నగరంలో తీర్మానించింది.

6. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో కూడిన ఎజెండా-2030 ను రూపొందించడంలో భారతదేశం ప్రముఖ పాత్ర పోషించింది. ప్రపంచం ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి, భారతదేశపు పరోగతిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందనీ, ఇది పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వాలు సాధించిన పురోగతిపైనే ఆధారపడి ఉంటుందని కూడా చెప్పవచ్చును.

7. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో కూడిన ఎజెండా ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు మరియు వివిధ ప్రభుత్వాలు తమ ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడానికి దృఢసంకల్పంతో ప్రయత్నాలు చేస్తున్నాయి. శాంతికి, సౌభాగ్యానికి అవసరమైన 'నమూనా ప్రణాళిక' ను ఈ 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అందిస్తాయి. ఆరోగ్యం మరియు విద్యను

3