పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎన్నో ప్రాణాలు పోతున్నా, నిరాశతో కూడిన చీకటి మేఘాలు కమ్ముకుంటున్నా, ప్రభుత్వాల, ప్రయోగశాలల, శాస్త్రవేత్తల, పరిశోధకుల నిరంతర కృషి మరియు ప్రపంచ దేశాల మధ్య సమకూరిన సహకారం మానవ జాతి యొక్క మనుగడను ఏకీకృతం చేసింది. భారతదేశం ఈ రోజు ప్రపంచ ఔషధ కేంద్రంగా ప్రశంసించ బడుతున్నందున, ప్రపంచాన్ని కుదుపుతున్న ఈ మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో భారతదేశాన్ని ముందంజలో నిలబెట్టడంలో మన వైజ్ఞానిక సమాజం మరియు మన ఔషధ పరిశ్రమ పోషించిన ప్రముఖ పాత్రను గుర్తించడం మన ప్రభుత్వం తరపున నా ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నాను.

3. చరిత్రలో మన భరత ఖండం మానవ పురోగతిలో పోషించిన పాత్ర గురించి ఈ సమయంలో గుర్తు చేసుకుంటున్నాను. క్రీస్తు పూర్వం 3500 నుండి క్రీ.పూ. 1800 మధ్య కాలంలో మన దేశంలో వెలసిల్లిన సింధులోయ నాగరికత పట్టణీకరణకు మరియు వాణిజ్యానికి మార్గదర్శిగా పనిచేసింది. అందువలన ప్రపంచంలోని గొప్ప నాగరికతలలో ఒకటిగా ఇది పరిగణించబడుతోంది. ఇంతేకాక, క్రీ.శ. 1 నుండి 17 వ శతాబ్దాల మధ్య, అనగా ప్రాచీన మరియు మధ్యయుగాలలో భారతదేశం ఒక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భాసిల్లి ప్రపంచ సంపదలో నాలుగవ వంతు కంటే ఎక్కువ ఉండేదని చెప్పబడింది.

4. భారతదేశంపై వలసపాలన యొక్క ఆర్థిక దుష్ప్రభావ పరిమాణం ఖచ్చితమైన అంచనా వేయబడనప్పటికీ, 18వ శతాబ్దం మధ్యకాలం నుండి దేశ ఆర్థికవ్యవస్థ చాలా వేగంగా క్షీణించిందన్న సంగతి చెప్పవచ్చు. వలస పాలనలో జరిగిన క్రూరమైన దోపిడి, భారతదేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసింది. బ్రిటిష్ ఆర్థికవేత్త ఆంగస్ మాడిసన్ అంచనా ప్రకారం, క్రీ.శ. 1700లో ప్రపంచ ఆదాయంలో 27% ఉన్న భారతదేశపు వాటా (నాటి యూరప్ వాటా 23% తో పోలిస్తే) 1950 నాటికి 3% కి పడిపోయింది.

2