పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విద్యారంగం



'దివా వశ్యతి నోలూకః కాకో నక్తం న వశ్యతి
విద్యావిహీనో మూఢస్తు దివా నక్తం న వశ్యతి'


గుడ్లగూబ పగలు చూడలేదు. కాకి రాత్రివేళల్లో చూడలేదు. చదువులేనివాడు రేయింబవళ్ళూ చూడలేదన్నది ఈ శ్లోకం అర్థం. పిల్లలకు బతుకునిచ్చే విద్యను నేర్పాలని మా ప్రభుత్వం సంకల్పించింది. పై మాటలే మాకు స్ఫూర్తి. రాష్ట్రాన్ని చదువుల బడిగా మార్చేందుకు ఎంత ఖర్చుకైనా వెనకాడరాదన్నది ముఖ్యమంత్రిగారి ఆదేశం.

భారతరత్న డా. బాబాసాహెబ్ భీంరావ్ అంబేడ్కర్ గారి ఈ మాటలు ఎన్నడూ నా మదిలో మెదులుతూ ఉంటాయి.

'మానవ మనోవికాసమే మనిషి మనుగడకు పరమార్ధం కావాలి'.

ఈ భావనకి ఎంతో సన్నిహితంగా రూపుదిద్దుకున్నదే మన గౌరవ ముఖ్యమంత్రి గారి మనస్సులో రూపుదిద్దుకున్న 'జగనన్న అమ్మఒడి' కార్యక్రమం.

18. ఈ పథకం ద్వారా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న (బి.పి.ఎల్) కుటుంబాలకు ఆర్థిక సహాయం కల్పించబడుతుంది. కుల, మత, వర్గ, ప్రాంత వివక్ష లేకుండా వారి పిల్లలు 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు గుర్తింపబడిన ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో చదువుకోవడం సాధ్యమవుతుంది.

19. పిల్లల్లో ప్రతిభా సామర్థ్యాలు పెంపొందించడానికి ప్రోత్సాహకాలు కల్పిస్తే సరిపోదు. వారు చదువుకోవడానికి అనుకూలంగా ఉండే సదుపాయాలు కల్పించడం కూడా అంతే అవసరం. అందుకు గానూ మొదటి దశలో ఎంపిక చేసిన 15,715 ప్రభుత్వ పాఠశాలల్లో 9 సౌకర్యాలకు సంబంధించిన పనులను తల్లిదండ్రుల భాగస్వామ్యం ద్వారా 'మనబడి నాడు-నేడు' పథకాన్ని అమలు పరచడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2020-21