పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అభివృద్ధి ప్రయోజనాలతో మేళవించి ముందుకు సాగవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఈ క్రమంలో బీద ప్రజలు, బడుగు జీవుల ప్రయోజనాలను సంరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో ప్రజలకు మరింత మెరుగైన జీవితాన్ని అందించే దిశగా పెట్టుబడులను, సంతులిత ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించవలసిన అవసరం కూడా ఉంది.

9. ఈ క్రమంలో మనకు ఎదురవుతున్న సవాళ్ళను గుర్తించిన తరువాత మన ప్రభుత్వం వాటికి సార్థకమైన పరిష్కారాలను సమకూర్చే దిశగా తన శక్తియుక్తులను మోహరిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఉజ్జ్వల భవిష్యత్తును సాధించుకునే దిశగా ఒక దీర్ఘకాలిక వ్యూహాన్ని రూపొందించుకునే పని మనం ఇప్పటికే మొదలు పెట్టాం. మన కార్యాచరణ పథం ఏ విధంగా ఉంటుందో, మన మేనిఫెస్టోలో తేటతెల్లం చేశాం. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి సమర్థవంతమైన నేతృత్వంలో మన ప్రభుత్వం మేనిఫేస్టోలో ప్రకటించిన వాగ్దానాలను ఇప్పటికే నవరత్నాల ద్వారా అమలు చేయటం మొదలుపెట్టింది. మేనిఫేస్టో అంటే ఎన్నికలు అయిపోగానే మర్చిపోయే ఒక కాగితం కాదని నేను గత ఏడాది నా బడ్జెటు ప్రసంగంలో చెప్పిన మాటల్ని మరొకసారి గుర్తుచేస్తున్నాను. మన ప్రభుత్వానికి మేనిఫేస్టో అనేది మనం దారి తప్పిపోకుండా ముందుకు తీసుకుపోగల దిక్సూచి అని మన గౌరవ ముఖ్యమంత్రిగారు అనుక్షణం గుర్తు చేస్తుంటారు.

'మాట ఇచ్చేముందు ఆలోచిస్తాను
 ఇచ్చాక ఆలోచించేది ఏముంది
ముందుకు వెళ్లాల్సిందే' అన్నారు డా|| వై.యస్.ఆర్.

అభివృద్ధి ప్రాధాన్యతలు

10. అభివృద్ధి దిశగా మన ప్రభుత్వం నిర్దేశించుకున్న నమూనాలను, వ్యూహాలను ఇప్పుడు నేను వివరించబోతున్నాను. ఆ ప్రాధాన్యతా క్రమంలో మన బడ్జెటు ప్రతిపాదనలను ఏ విధంగా రూపకల్పన చేశామో వివరించబోతున్నాను.

4