పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీలవుతుంది. వీటితో పాటు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు, గాలేరు నగరి సుజల స్రవంతి, గండికోట రిజర్వాయరు, హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు, చింతలపూడి ఎత్తిపోతల పథకాలు కూడా ప్రభుత్వ ప్రాధాన్యతలే. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి దక్కినవాటాను పూర్తి స్థాయిలో వినియోగించుకోడానికి ఈ పథకాల ద్వారా వీలవుతుంది. తద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యపడుతుంది.

85. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను సాగునీటి వనరుల నిమిత్తం రూ.11,805.85 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

అడవులు-పర్యావరణం

'మనం అడవుల కోసం ఏం చేస్తున్నాం అన్నది మనం మనకోసం ఏం చేసుకుంటున్నాం అన్న దానికి ప్రతిరూపమే' అన్నారు మహాత్మాగాంధీ.

86. ఈ లబ్ధినంతటిని ప్రభుత్వం మరింత పటిష్టపరచాలని భావిస్తున్నది. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అడవుల శాతం 33 ఉండేలా చూడడానికి మనం ఒక వినూత్న కార్యక్రమానికి అంకురార్పణ చేశాం. ప్రతి ఒక్క పౌరుడు తనకంటూ ఒక మొక్కను నాటాలనే నినాదంతో సీనియర్ సిటిజన్లను భాగస్వాములను చేస్తూ ఒక వన మహోత్సవాన్ని మొదలు పెట్టాం. ఇందుకు అవసరమైన మొక్కల పంపిణీలో, మొక్కల్ని నాటడంలో గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్లను కూడా భాగస్వాములుగా చేస్తున్నాము. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను అడవులు, పర్యావరం, సైన్సు టెక్నాలజీ శాఖకు రూ.457.29 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

రవాణా రహదారి సదుపాయాలు

87. తాను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ, మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేస్తూ వారిని కొత్తగా ఏర్పరచిన పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంటు పరిధిలోకి తీసుకు వచ్చింది.

33