పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భారం మన భుజాలపై పడింది. 2018-19 సం॥లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి కేవలం 8.8% మాత్రమే పెరిగింది. అప్పటికే గత ప్రభుత్వం పదేపదే ఘనంగా చెప్పుకుంటూ వున్న రెండంకెల వార్షిక ప్రగతి అవాస్తవమని తేలింది. గత ప్రభుత్వం వదిలిపెట్టి వెళ్ళిన బకాయిలు దాదాపు రూ. 60,000 కోట్ల మేరకు పెండింగ్ బిల్లుల రూపంలో సునామీలా వచ్చి పడుతూనే ఉన్నాయి. 2019-20, 2020-21 సంవత్సరాల్లో కేంద్ర పన్నుల బదలాయింపులో తగ్గుదల, 2020-21 సంవత్సరానికి సంబంధించిన డివిజబుల్ పూల్ లో తగ్గిన వాటాతో పాటు, కోవిడ్-19 వల్ల ప్రకటించిన లాక్ డౌన్ చర్యల వల్ల తగ్గుముఖం పట్టిన ఆదాయ వనరులు మన ఆర్థిక సమస్యను మరింత తీవ్రతరం చేశాయి. అయితే నేను ఈ సమస్యలను మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు వారు నెల్సన్ మండేలా గారి క్రింది వ్యాఖ్యల్ని గుర్తుచేశారు.

'ఎవరైనా తాము చేపట్టాలనుకుంటున్న మార్పుని సాధించడానికి పరిపూర్ణంగా అంకితమైతే ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించి విజయం సాధిస్తారు'

7. నేను ఇంతదాకా విన్నవించిన ప్రతికూల పరిస్థితుల ముందు మరొక ప్రభుత్వం ఏదైనా ఉండి ఉంటే పూర్తిగా చేతులు ఎత్తివేసి ఉండేది. కానీ, గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డిగారి వజ్ర సంకల్పం, అజేయ సామర్థ్యాల ముందు ఈ ప్రతికూలతలు నిలబడలేకపోయాయి. సామాజిక చట్రంలో అట్టడగున ఉన్న ప్రజలను ప్రత్యక్ష ఆర్థిక సహాయం ద్వారా పైకి తీసుకురావాలని, అదే విధంగా మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను మార్చాలని వారు తీసుకున్న నిర్ణయాలు పరిపాలనా సవాళ్ళకు ఎదురీది నిలబడ్డాయి.

8. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రభుత్వ ధనాన్ని వ్యయపరిచే అలవాటును మన ప్రభుత్వం వ్యతిరేకించింది. అందుకు బదులుగా మనం ప్రభావశీలమైన లక్ష్యసాధనకు నిర్దేశించుకున్న కార్యాచరణ పైనే దృష్టి పెడుతూ వచ్చాం. ప్రభుత్వం అంటే ప్రజా ధనానికి ధర్మకర్త అని ఈ ప్రభుత్వం విశ్వసిస్తున్నది. తమ పట్ల ప్రజలు చూపుతున్న విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికే అహర్నిశలు కృషి చేస్తున్నది. ఆర్థిక సంస్కరణల ప్రాధాన్యతలను రాష్ట్ర

3