పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన

59. ఉన్నత విద్య కొనసాగించే విద్యార్థుల నిష్పత్తిని పెంచడం కోసం, విద్యార్థులకు ఫీజులు పూర్తిగా తిరిగి చెల్లించడానికి జగనన్న విద్యాదీవెన కార్యక్రమాన్ని, వారి ఆహార, వసతి అవసరాలను తీర్చడం కోసం జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది. జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా పాలిటెక్నిక్, ఐటిఐ, మెడికల్, ఇంజనీరింగ్, డిగ్రీ మరియు పై చదువులకు పూర్తి ఫీజు రియింబర్స్ మెంట్ మన ప్రభుత్వం చేస్తున్నది. షెడ్యూల్డు కులాల, షెడ్యూల్డు తెగల, వెనుకబడిన తరగతుల, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల, కాపు సామాజిక వర్గానికి చెందిన, అల్ప సంఖ్యాకుల వర్గానికి చెందిన మరియు విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ పథకాలు వర్తిస్తాయి. వీటి కింద ఐటిఐ విద్యార్థులకు ఏడాదికి రూ.10,000 చొప్పున, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15,000 చొప్పున, డిగ్రీ, అంతకన్నా పై చదువుల విద్యార్థులకు రూ.20,000 వార్షిక సహాయం అందుతున్నది. 12 లక్షల పై చిలుకు విద్యార్థులు ఈ పథకం కింద లబ్ది పొందారు. ఇందులో వెనుకబడిన తరగతులకు చెందిన 8,21,354 మంది విద్యార్థులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన 1,19,027 మంది విద్యార్థులు, కాపు సామాజిక వర్గానికి చెందిన 1,96,817 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పథకాల నిమిత్తం 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 5,009 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.


ఉచిత విద్యుత్ పథకం

60. షెడ్యూల్డు తెగల, షెడ్యూల్డు కులాలకు సంబంధించిన కుటుంబాలకు గృహ అవసరాల నిమిత్తం 200 యూనిట్ల దాకా ప్రభుత్వం ఉచిత విద్యుత్తును సమకూరుస్తున్నది. దాదాపు 21 లక్షల కుటుంబాలు ఈ మేరకు లబ్ది పొందుతున్నాయి. వీరితో పాటు గ్రామీణ ఉద్యానవన నర్సరీలు, దోబీ ఘాట్లు, దారిద్ర్యరేఖకు దిగువన గల రజక కుటుంబాలు మరింత వెనుకబడిన తరగతులకు చెందిన కుటుంబాలు, చేనేత కార్మికులు, క్షార శాలలు, ఇమిటేషన్ జ్యూయలరి యూనిట్లు మొదలయినవి ఉచిత విద్యుత్తు లేదా తక్కువ చార్జీ విద్యుత్తు సదుపాయం పొందుతున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఉచిత విద్యుత్ పథకం కింద రూ.425.93 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

24