పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షెడ్యూల్డు కులాల తల్లులకు, 19,65,589 మంది వెనుకబడిన తరగతులకు చెందిన నిరుపేద తల్లులకు, 2,76,155 మంది గిరిజన మాతృమూర్తులకు, 4,03,562 మంది ఆర్థికంగా వెనుకబడిన వారికి, 3,95,870 మంది కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి, 2,95,540 మైనారిటీ వర్గాలకు చెందిన వారికి ఈ ఆర్థిక సహాయం అందించడం జరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ 'జగనన్న అమ్మఒడి' పథకం కింద నేను రూ. 6,000 కోట్లు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వై.యస్.ఆర్. చేయూత

57. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్కులైన స్త్రీలకు ఆర్థిక సహాయాన్ని పరిపుష్టం చేయడం కోసం గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు నిర్విరామంగా చేపడుతున్న చర్యల్లో వై.యస్.ఆర్. చేయూత ముఖ్యమైన కార్యక్రమం. ఈ పథకం కింద 2020-21 ఆర్థిక సంవత్సరంతో మొదలైన నాలుగు సంవత్సరాల పాటు షెడ్యూల్డు కులాల, షెడ్యూల్డు తెగల, వెనుకబడిన తరగతుల, మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు రూ.18,750 వార్షిక సహాయం అందించబడుతుంది. ఇందు నిమిత్తం 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.3,000 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

వై.యస్.ఆర్. ఆసరా

58. రాష్ట్రంలో స్వయం సహాయక బృందాల వ్యవస్థ చుట్టూ రాష్ట్రంలోని గ్రామీణ, అసంఘటిత ఆర్థిక వ్యవస్థకు చెందిన స్త్రీలు ఆధారపడి ఉన్నారు. స్వయం సహాయక ఆర్థిక బృందాల కార్యకలాపాల్లో నిరంతరాయంగా ఎప్పటికప్పుడు నగదు మార్పిడి జరుగుతుండాలి. వారి పొదుపు సార్థకం కావాలి. ఈ ఉద్దేశంతో వై.యస్.ఆర్. ఆసరా పథకాన్ని చేపట్టాం. ఈ పథకం కింద 2019 ఏప్రిల్ 11 నాటికి పోగుపడ్డ బ్యాంకు ఋణం సుమారు రూ.27,168.83 కోట్లను 2020-21 నుండి 4 విడతలుగా చెల్లించడం జరుగుతుంది. ఇందుకుగాను 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 6,300 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

23