పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/18

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


43. పశుగణాభివృద్ధి, మత్స్యరంగాల అభివృద్ధి నిమిత్తం 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.1,279.78 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

గృహ నిర్మాణం

రాబర్ట్ మాంట్ గొమరీ మాటల్లో చెప్పాలంటే

'ఇల్లు ఈ ప్రపంచంలో అన్నింటికన్నా అత్యంత ప్రియమైన, మధురమైన, సౌభాగ్యవంతమైన స్థలం. తక్కినవన్నీ దాని తరువాతే'.

'పేదవాడికి సొంతిళ్ళు తీరని స్వప్నం. జాగా ఉంటే ఇళ్లు కట్టేందుకు డబ్బు లేకపోవడమో, డబ్బుంటే గృహనిర్మాణానికి అవసరమైన జాగా లేకపోవడమో ఏదో ఒక సమస్య ఎప్పుడూ వారిని వేధిస్తూ ఉంటుంది. దేశవ్యాప్తంగా ఇళ్ల కొరత తీవ్రమవుతున్న తరుణంలో ప్రభుత్వాలు తమ విధానాలను పేదవాడి అవసరాలకు అనుగుణంగా మార్పు చేసుకోవాల్సిన అవసరాన్ని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే గుర్తించింది. నిరుపేదల సొంతింటి కల నిజం కావాలంటే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి. ఈ దిశగా మా సంకల్ప శుద్ధిని, నిబద్ధతను మొదటి ఏడాదే నిరూపించుకున్నాం. రాష్ట్రంలో గృహ అవసరాలను తీర్చే క్రమంలో నిర్మాణాత్మక విధానాలతో ముందుకెళుతున్నాం.

44. అర్హులైన బీద కుటుంబాలు అన్నింటికి గృహ సదుపాయం కల్పించడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 678.26 కోట్ల వ్యయంతో 40,841 గృహాల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. పేదలందరికీ ఇళ్లు అనే పథకం కింద ప్రభుత్వం ఇళ్లు లేని అర్హులైన బీదలందరికీ 30 లక్షల ఇళ్ల పట్టాలు రూ.8,000 కోట్లతో అందించాలనే కృతనిశ్చయంతో ఉంది. దానితో పాటు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 6,25,000 గృహాలు నిర్మించాలని కూడా ప్రతిపాదిస్తున్నాం. గృహనిర్మాణ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడం కోసం గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణతో అనుసంధానిస్తున్నాం.

18