పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/17

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బిడ్డల జీవితాలలో గుణాత్మక మార్పు తీసుకురావాలని మా ప్రభుత్వం సంకల్పిస్తోంది. మత్స్యకారులకు అండగా నిలిచేందుకు ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. మత్స్యకారుల జీవితాలకు ప్రభుత్వం సంపూర్ణమైన భరోసాగా నిలుస్తోంది.

40. ఆంధ్రప్రదేశ్ లో మత్స్య రంగం దాదాపు 14.5 లక్షల మందికి ఉపాధి సమకూరుస్తున్నది. దేశం నుండి ఎగుమతి అవుతున్న సముద్ర సంబంధమైన ఆహార ఉత్పత్తులలో 36% రాష్ట్రం నుంచే ఎగుమతి అవుతున్నవి. మత్స్య రంగం మీద ఆధారపడ్డ కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం డా.వై.యస్.ఆర్. మత్స్యకార భరోసా పథకాన్ని అమలు చేస్తున్నది. చేపలు పట్టడం మీద నిషేదాజ్ఞలు అమలు అయ్యే కాలంలో మత్స్యకార కుటుంబాలకు అందించే ఆర్థిక సహాయాన్ని రూ.4,000 నుండి రూ.10,000కు పెంచడం జరిగింది. ఈ పథకం కింద ఇంతదాకా 1,02,332 సముద్రతీర మత్స్యకార కుటుంబాలు లబ్దిపొందాయి.

41. అంతేగాక ఫిషింగ్ బోట్ల డీజిల్ ఆయిల్ మీద ఇచ్చే సబ్సిడీలను కూడా ప్రభుత్వం లీటరుకు రూ.6.03 నుండి రూ.9 కి పెంచింది. తద్వారా 2019-20 ఆర్థిక సంవత్సరంలో 19,796 బోట్లు లబ్ది పొందాయి. ఆక్వా రైతులందరికీ విద్యుత్ చార్జీలలో కూడా మినహాయింపులు అందచేయబడ్డాయి. వారి విషయంలో విద్యుత్తు చార్జీలు ప్రతి ఒక్క యూనిట్‌కు రూ.3.86 నుండి రూ.1.50 కి తగ్గించబడ్డాయి. తద్వారా 53,500 మంది ఆక్వా రైతులు లబ్ధి పొందారు. చేపలు పట్టే సమయంలో ఆకస్మికంగా మృతి చెందే మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అందించే ఆర్థిక సహాయాన్ని రూ. 5.00 లక్షల నుండి రూ. 10.00 లక్షలకు పెంచడం జరిగింది.

42. 974 కిలోమీటర్ల పొడవైన తీర రేఖతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో రెండవ స్థానంలో నిలుస్తున్నది. మత్స్యరంగాన్ని మరింత అభివృద్ధి పరచడం కోసం జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, బుడగట్లపాలెం, పూడిమెడక, కొత్తపట్నం, బియ్యపుతిప్పల్లో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టనున్నాం. ఇందుకు గాను 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.142.66 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

17