పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లేబొరేటరీలు గ్రామీణ ప్రాంతాల్లోని శాసనసభ నియోజకవర్గాల కేంద్రాలలోనూ, 13 జిల్లా కేంద్రాలలోనూ నెలకొల్పబడతాయి. వీటితో పాటు విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యతను పరిశీలించటానికి 4 ప్రాంతీయ కోడింగ్ కేంద్రాలు కూడా నెలకొల్పనున్నాం. ఈ విధంగా డా.వై.యస్.ఆర్. అగ్రి టెస్టింగ్ లేబొరేటరీల ఏర్పాటకు గాను 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 65 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

37. కనీస మద్దతు ధర కలిగిన పంటలకు అమ్మకానికి అవకాశాలు పెంపొందించడానికీ, కనీస మద్దతు ధర లేని పంటలు సాధారణ ధర కన్నా తక్కువగా అమ్ముడు పోకుండా ఉండటానికి ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. రూ.3,000 కోట్ల ఈ నిధి ఏర్పాటు రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మక నిర్ణయం. అంతేకాక ఉల్లి, మిర్చి, పసుపు, అరటి, నారింజ, చిరు ధాన్యాలకు కనీస మద్దతు ధర ప్రకటించిన ఏకైక ప్రభుత్వం మనదే. రైతుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం కోసం ప్రభుత్వం 1907 పేరిట ఒక టోల్ ఫ్రీ నెంబరును కూడా ఏర్పాటు చేసింది. ధరల స్థిరీకరణ నిధి ద్వారా పచ్చిశనగ రైతులకు రూ. 96.11 కోట్ల మేరకు, ఉల్లి రైతులకు రూ. 63.12 కోట్ల మేరకు సకాల ఆర్థిక సహకారాన్ని అందించ గలిగాం. మార్క్ ఫెడ్ ద్వారా రూ.2,188 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులను అందులో రూ.1500 కోట్ల ఉత్పత్తులు ఈ కోవిడ్-19 లాక్ డౌన్ సమయంలో సేకరించడం జరిగింది.

'వర్షంబు లేకున్న ధాన్యంబులగునా' అని మహాభారతంలో ఒక మాట ఉంది. ఈ మాట అర్థం, వర్షంలేని పక్షంలో మనం ఎన్ని విత్తనాలు వేసినా పంట పండదు.

మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే వర్షాలు సమృద్ధిగా కురిశాయి, పంటలు ఏపుగా పెరిగాయి. రైతన్న మొహాలలో ఆనందం వెల్లివిరిసింది.

ధర్మపాలనకు, అధర్మపాలనకు తేడా ఇదే. అందుకు భగవంతుడు రాసిన స్క్రిప్ట్ సాక్ష్యం .

15